పిడుగులతో దద్దరిల్లిన నగరం
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:43 AM
తీవ్రమైన వాతావరణ అనిశ్చితి ప్రభావంతో విశాఖ, పరిసరాలు ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పిడుగుల శబ్దాలతో దద్దరిల్లాయి.
రెండుగంటల పాటు ఉరుములు, మెరుపులు
పలుచోట్ల జోరువాన
లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీరు
మహారాణిపేట కామన్ పాయింట్‌లో 53.75 మి.మీ.ల వర్షపాతం నమోదు
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
తీవ్రమైన వాతావరణ అనిశ్చితి ప్రభావంతో విశాఖ, పరిసరాలు ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పిడుగుల శబ్దాలతో దద్దరిల్లాయి. నివాస ప్రాంతాల్లోనే పిడుగులు పడుతున్నాయన్న ఆందోళన జనంలో కనిపించింది. దీనికితోడు ఉరుములు, మెరుపులతో ఆకాశం ఎర్రబారింది. భారీగా పిడుగులు, మెరుపులు, ఉరుములతో వర్షాలు కురవడం ఈ వారంలో ఇది రెండోసారి. ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత కొనసాగింది. దీనికితోడు సముద్రం నుంచి తేమగాలులు నగరం, పరిసరాలపైకి వీయడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. సాయంత్రానికి నగర సమీపంలో భారీగా మేఘాలు ఏర్పడడంతో ఒక్కసారిగా చీకట్లు కమ్మేశాయి. ఆ తరువాత పెద్ద శబ్దాలతో పిడుగులు, మెరుపులు, ఉరుములు సంభవించాయి. నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు గంటపాటు వర్షం కురిసింది. ఈదురుగాలులు, పిడుగులతో ఆరుబయట ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు. సాయంత్రం తీరానికి చేరిన వారు తడిసి ముద్దయ్యారు.
నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆరుబయట వ్యాపారాలు చేసేవారంతా ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల సరుకులు తడిసిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. మురుగుకాల్వలు పొంగాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వారం రోజులగా వర్షాలు కురుస్తుండంతో కొండవాలు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నగరంలోని మహారాణిపేట కామన్‌పాయింట్‌లో 53.75, గాజువాక కేబీఆర్ రిజర్వాయర్‌లో 52.5, గవరపాలెంలో 50.5, రెవెన్యూపార్కులో 49,75, గోపాలపట్నంలో 43.0, హెచ్‌బీకాలనీలో 41.5 మి.మీ.ల వర్షపాతం నమోదయింది.