ఉలిక్కిపడిన పారిశ్రామిక ప్రాంతం
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:33 AM
హెచ్‌పీసీఎల్‌లోని యూనిట్-1లో శుక్రవారం ఉదయం పైప్‌లైన్ నుంచి హైడ్రోజన్ లీకై మంటలు చెలరేగడంతో వేలాది మంది కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
హెచ్‌పీసీఎల్‌లో ప్రమాదంతో కలవరం
ఘటనపై అధికారుల విచారణ
మానవ తప్పిదమా?, సాంకేతిక సమస్యా?...అనే అంశం పరిశీలన
మల్కాపురం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
హెచ్‌పీసీఎల్‌లోని యూనిట్-1లో శుక్రవారం ఉదయం పైప్‌లైన్ నుంచి హైడ్రోజన్ లీకై మంటలు చెలరేగడంతో వేలాది మంది కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో పారిశ్రామిక ప్రాంతం ఉలిక్కిపడింది. అయితే మంటలను అదుపు చేశారని తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి కారణం మానవ తప్సిదమా, లేక సాంకేతిక సమస్య వల్ల ఉత్పన్నమైందా...అనే దానిపై సంస్థ అధికారులు విచారణ జరుపుతున్నారు. కార్మికులెవరూ గాయపడలేదని, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
ఘటనా స్థలానికి తహశీల్దార్
ప్రమాద స్థలాన్ని ములగాడ మండల తహశీల్దార్ రమేష్‌నాయుడు, ఆర్‌ఐ దివ్య సంద ర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కంప్రెసర్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కేవలం నలుగురు కార్మికులు మాత్రమే ఉన్నారని, వారు కూడా ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారని తెలిపారు.
భద్రత లేదు: సీఐటీయూ
నూతనంగా నిర్మిస్తున్న యూనిట్‌లో కార్మికులకు భద్రత లేదని సీఐటీయూ నాయకుడు లక్ష్మణమూర్తి ఆరోపించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న యూనిట్‌లో ఇంకా పనులు కొనసాగుతుండగానే చమురు శుద్ధి పనులు మొదలుపెట్టేశారని ఆరోపించారు. అంత భారీపేలుడు సంభవించినప్పటికీ అధికారులు సైరన్ మోగించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. యాజమాన్యం కార్మికులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు
- టాస్క్‌ఫోర్స్, ఆహార భదత్ర,
ప్రమాణాల శాఖ అధికారులు దాడులు
- 120 కిలోల స్వాధీనం...ముగ్గురి అరెస్టు
విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
కల్తీ నెయ్యి తయారుచేస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఆహార భద్రతా, ప్రమాణాల శాఖ అధికారులు శుక్రవారం రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే...పూర్ణామార్కెట్ ప్రాంతంలోని విశ్రాంత్ లాడ్జిలోని రూమ్ నంబర్ 109లో బళ్లారి కి చెందిన ముగ్గురు కల్తీ నెయ్యి తయారుచేస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆహార భద్రతా ప్రమాణాల శాఖ అధికారులతో కలిసి లాడ్జిపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ పెద్దఎత్తున కల్తీ నెయ్యి తయారు చేస్తుండడాన్ని గమనించారు. వివిధ కంపెనీలకు చెందిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో బళ్లారి నుంచి తెచ్చిన క్రీమ్స్‌ను కలిపి నెయ్యి మాదిరి తయారు చేస్తున్నట్టు, వాసన రావడానికి కొన్నిరకాల రసాయనాలను వినియోగిస్తున్నట్టు ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు గుర్తించారు. కల్తీ నెయ్యిని కిలో రూ.350 చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో ఫంక్షన్లకు కేటరింగ్ చేసే సంస్థలకు విక్రయిస్తున్నట్టు తేల్చారు. కల్తీ నెయ్యి తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బళ్లారికి చెందిన లక్ష్మీపతి, శ్రీధర్, రాజశేఖర్‌లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారుచేసిన 120 కిలోల కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించనున్నట్టు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు తెలిపారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఎస్.ఐ. భరత్‌కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీసీ దసరా స్పెషల్స్ 300
హైదరాబాద్, విజయవాడ, కాకినాడ,రాజమండ్రి ప్రాంతాలకు 100
శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, పలాస, విజయనగరం ప్రాంతాలకు 200
స్పెషల్స్‌లోనూ సాధారణ చార్జీలే
ద్వారకా బస్‌స్టేషన్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
దసరా స్పెషల్ సర్వీస్‌లుగా 300 బస్సులు నడపాలని ఆర్టీసీ విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది. హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలకు 100, జోనల్ పరిధిలోని శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు వంటి ప్రాంతాలకు 200 ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేసేందుకు ప్రణాళిక తయారుచేసింది. ఈనెల 22 నుంచి వీటిని నడపనున్నది. షెడ్యూల్ సర్వీస్‌లలో సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణికుల డిమాండ్ ఉంటేనే ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. స్పెషల్స్‌లోనూ సాధారణ చార్జీలు వసూలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
స్త్రీశక్తి ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉండొచ్చు
రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేసిన తరువాత ప్రయాణికుల సంఖ్య భారీ పెరిగిందని, దసరా రోజుల్లో మరింత సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దసరా ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్టీసీ రీజనల్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, ట్రాఫిక్ మేనేజర్లు, కంట్రోలర్లు అప్రమత్తంగా ఉండాలని రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ఉత్తర్వులు జారీచేశారు. ప్రయాణికుల డిమాండ్ ఉంటే రాత్రి సమయాల్లో కూడా ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
అప్పన్న ఆభరణాలపై నివేదిక సమర్పణ
సింహాచలం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన స్వర్ణ, రజిత ఆభరణాలకు సంబంధించిన సమగ్ర నివేదికను ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ దేవదాయ శాఖ మల్టీ జోన్-1 రీజినల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావుకు అందజేసింది. ఆభరణాల విషయంలో వ్యత్యాసాలు ఉన్నట్టుగా కడపకు చెందిన స్వచ్ఛంద సేవా కార్యకర్త ప్రభాకరాచారి జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు మేరకు ఆర్‌జేసీ ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. వారు సుమారు 15 రోజుల పాటు ఆలయ అర్చకుల వద్ద, భాండాగారంలో, ఉపాలయాల్లో, సింహాచలం జాతీయ బ్యాంకులోని ఆభరణాలను ప్రత్యక్షంగా తనిఖీ చేసి, రికార్డులతో సరిపోల్చిన తరువాత నివేదికను రూపొందించి ఆర్‌జేసీకి అందజేశారు. ఆయన దానిని దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌కు దానిని సమర్పించారు.