ఏయూలో డిఫెన్స్ కోర్సులకు బ్రేక్?
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:08 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం డిఫెన్స్ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొన్ని కోర్సులకు ఈ ఏడాది అనుమతి లభించలేదు. డిఫెన్స్ స్టడీస్ ఆధ్వర్యంలో 2017 నుంచి ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం వివిధ రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. వీటి నిర్వహణకు అవసరమైన ఫీజులు, ఇతర ఖర్చులను మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ (డీఈఎస్‌డబ్ల్యు) ఆధ్వర్యంలోని డైరెక్టర్ జనరల్ రీసెటిల్‌మెంట్ (డీజీఆర్) చెల్లిస్తోంది.
సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ ఆధ్వర్యంలో పలు కోర్సుల నిర్వహణ
ఈ ఏడాదికి షెడ్యూల్ విడుదల చేయని డీజీఆర్ అధికారులు
కారణాలపై స్పష్టత లేని వైనం
ఈ కోర్సుల ద్వారా వర్సిటీకి ఏటా రూ.4 కోట్ల వరకు ఆదాయం
విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం డిఫెన్స్ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొన్ని కోర్సులకు ఈ ఏడాది అనుమతి లభించలేదు. డిఫెన్స్ స్టడీస్ ఆధ్వర్యంలో 2017 నుంచి ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం వివిధ రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. వీటి నిర్వహణకు అవసరమైన ఫీజులు, ఇతర ఖర్చులను మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ (డీఈఎస్‌డబ్ల్యు) ఆధ్వర్యంలోని డైరెక్టర్ జనరల్ రీసెటిల్‌మెంట్ (డీజీఆర్) చెల్లిస్తోంది. కోర్సుల నిర్వహణకు అనుగుణమైన షెడ్యూల్‌ను డీజీఆర్ అధికారులే ఏయూలోని డిఫెన్స్ స్టడీస్‌కు అందిస్తుంటారు.
కొన్ని కోర్సులకు సంబంధించిన షెడ్యూల్ ఈ ఏడాది మార్చితో పూర్తయింది. కొత్త బ్యాచ్‌లకు షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో చర్చ జరుగుతోంది. షెడ్యూల్‌ను ఎందుకు ఇవ్వలేదన్న దానిపై వర్సిటీ అధికారులకు కూడా సమాచారం లేదు. ఈ కోర్సుల నిర్వహణ ద్వారా ఏయూకు ఏటా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం వస్తోంది. మొత్తంగా ఏడు కోర్సులు నిర్వహిస్తుండగా, ఏడాదికి 12 నుంచి 14 బ్యాచ్‌లు రిలీవ్ అవుతుంటాయని, ఒక్కో బ్యాచ్‌లో 35 నుంచి 50 మంది ఉద్యోగులు/రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఆయా బ్యాచ్‌లకు బోధించే పాఠాల సమయాన్ని బట్టి (గంటలు) ఫీజులు చెల్లిస్తుంటారు.
ఇవీ కోర్సులు..
ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ( పదవీ విరమణ చేయడానికి కొద్దినెలల ముందు), పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులకు డీజీఆర్ ఆయా కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తోంది. దీనివల్ల ఉద్యోగ విరమణ తరువాత వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నది ఉద్దేశం. ఈ నేపథ్యంలో 2017 నుంచి కొన్ని రకాల కోర్సులను నిర్వహించేలా ఏయూతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం యోగా ఇన్‌స్ట్రక్టర్, మెరైన్ ఇంజనీరింగ్, మెరైన్ ఎలక్ర్టికల్ అండ్ నావిగేషన్ ఎలక్ర్టానిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, ఫైర్ అండ్ ఇండస్ర్టియల్ సేఫ్టీ ఇంజనీరింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను నిర్వహిస్తున్నారు. ఆయా కోర్సుల కాల వ్యవధి మూడు నుంచి ఆరు నెలలు ఉంటుంది.
కొరవడిన స్పష్టత..
ఇప్పటివరకూ కొన్ని వందల మంది డిఫెన్స్‌కు చెందిన ఉద్యోగులు ఇక్కడ కోర్సులు పూర్తిచేశారు. కరోనా సమయంలో మినహా కోర్సుల నిర్వహణలో అంతరాయం ఏర్పడలేదు. తొలిసారి డీజీఆర్ నుంచి కోర్సుల నిర్వహణపై సమాచారం వర్సిటీ అధికారులకు రాలేదు. సాధారణంగా కోర్సులు నిర్వహిస్తుండగానే తదుపరి కోర్సుల కొనసాగింపునకు సంబంఽధించిన సమాచారం, ఆయా కోర్సుల్లో చేరే వారి జాబితా ఏయూకు చేరుతుంది. ఈ ఏడాది మార్చితో కోర్సులు పూర్తయినప్పటికీ, ఇప్పటివరకూ తదుపరి కోర్సుల్లో చేరే వారి జాబితా, షెడ్యూల్ రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.