స్వయం ఉపాధికి ఊతం
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:29 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన సంక్షేమ శాఖలకు కూటమి ప్రభుత్వం మళ్లీ ఊపిరిలూదుతోంది.

సంక్షేమ శాఖలకు మళ్లీ ఊపిరి
వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యం
ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ద్వారా పలు పథకాల అమలుకు నిధులు మంజూరుచేసిన కూటమి ప్రభుత్వం
సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు
దరఖాస్తులు ఆహ్వానిస్తూ కలెక్టర్ ప్రకటన
బీ.ఫార్మసీ/డీ.ఫార్మసీ పూర్తిచేసిన నిరుద్యోగ బీసీ, ఈబీసీ యువతకు జనరిక్ ఔషధ దుకాణాల ఏర్పాటుకు రుణం
కుట్టు శిక్షణ, లబ్ధిదారులకు ఉచితంగా మిషన్లు పంపిణీకి ఆదేశాలు
విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన సంక్షేమ శాఖలకు కూటమి ప్రభుత్వం మళ్లీ ఊపిరిలూదుతోంది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ కార్పొరేషన్ల ద్వారా పథకాల అమలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందుకు నిధులు మంజూరుచేసింది. మైనారిటీ సంక్షేమ శాఖకు కొద్దిరోజుల కిందట నిధులు ఇచ్చింది. మరో వారం రోజుల్లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరికొన్ని పథకాల అమలుకు అనుమతి రానున్నదని అధికారులు చెబుతున్నారు.
బీసీ సంక్షేమ శాఖలో...
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు పథకాల అమలుకు ప్రభుత్వం నుంచి జనవరి నెలాఖరులోనే అనుమతి లభించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదాపడింది. కోడ్ ముగియడంతో స్వయం ఉపాధి పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు (కాపు, తెలగ, బలిజ, ఒంటరి) కులాలకు చెందిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. రుణాలకుఈ నెల 22వ తేదీలోగా అ్కౖఆకకఖి/జ్ట్టిఞ://్చఞౌఛఝఝట.్చఞఛిజటట.జీుఽ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వ్యవసాయం, అనుబంధ, రవాణా, పరిశ్రమలు, సేవలు, వ్యాపార రంగాల్లో స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీపై రుణాలు అందిస్తామన్నారు. అలాగే, బీ.ఫార్మసీ/డీ.ఫార్మసీ పూర్తి చేసిన నిరుద్యోగ బీసీ, ఈబీసీ యువతకు జనరిక్ ఔషధ దుకాణాల ఏర్పాటుకు రుణాలు అందించనున్నట్టు వెల్లడించారు. మేదర, కుమ్మరి/సాలివాహన వృత్తి చేస్తున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. కాగా, ఇందులో 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోందని, మరో 50 శాతం బ్యాంకు రుణంగా మంజూరుచేస్తుందని అధికారులు చెబుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని కార్పొరేషన్లకు ప్రభుత్వం 2,313 యూనిట్లను మంజూరుచేసింది. ఇందులో సబ్సిడీ రూ.27.21 కోట్లు, బ్యాంకు రుణం రూ.27.21 కలిపి మొత్తం రూ.54.44 కోట్లు. అలాగే, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొద్ది రోజుల కిందట దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు. బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఆర్య వైశ్య, రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ల పరిధిలోని మహిళలకు ఉచితంగా మూడు కేటగిరీల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ఆయా కార్పొరేషన్ల పరిధిలో 3,596 మంది లబ్ధిదారులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతోపాటు ఖరీదైన కుట్టు మిషన్లను అందించనున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలోని లబ్ధిదారులకు ఇదే తరహాలో సబ్సిడీతో కూడిన రుణాలు అందించేందుకు మరో వారం రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని పథకాలు..
గతంలో మాదిరిగా సంక్షేమ శాఖలను పూర్తిగా గాడిన పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వందలాది మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతి నెలా స్టైపెండ్ అందిస్తోంది. అలాగే యువత స్వయం ఉపాధి పొందేలా గతంలో మాదిరిగా వివిధ రకాల వాహనాలు అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెబుతున్నారు. కొద్దిరోజుల్లోనే వీటికి సంబంధించిన విధి, విధానాలు వెలువడతాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా కోళ్ల పెంపకం, దుకాణాల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
పేదల గృహ నిర్మాణానికి రూ.305.13 కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా నిధులు
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అదనంగా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ వెల్లడించారు. బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీ వర్గాలకు రూ.75 వేలు చొప్పున జిల్లాకు రూ.305.13 కోట్లు మంజూరుకానున్నట్టు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో హౌసింగ్ పీడీ సీహెచ్ సత్తిబాబుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీఎంఏవై కింద ఇళ్లు మంజూరై, ఇప్పటికీ పూర్తికానటువంటి వాటికి మాత్రమే ఈ సాయం లభిస్తుందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 2029 నాటికి అందరికీ గృహాలు నిర్మించాలన్న సంకల్పంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్లు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పీఎంఏవై కింద ఒక ఇంటికి ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ధర రూ.1.8 లక్షలు అని, దీనిలో భాగంగా ఆప్షన్-1 (లబ్ధిదారుడు సొంతంగా ఇళ్లు నిర్మించడం); ఆప్షన్ 2 (ప్రభుత్వం మెటీరియల్ ఇస్తే లబ్ధిదారుడు నిర్మించుకోవడం) కింద జిల్లాకు మంజూరైన 24 వేల ఇళ్లలో ఇంతవరకూ పూర్తిచేయని బీసీ/ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన ఇళ్లు 8,619 ఉన్నాయన్నారు. వారందరికీ రూ.43.4 కోట్లు అదనపు సాయం అందుతుందన్నారు. అలాగే నగర శివారుల్లోని 65 లేఅవుట్‌లలో ప్రారంభించిన 1,14,805 ఇళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందినవి 63,963 ఇళ్లు ఉన్నాయన్నారు. వారికి రూ.321.73 కోట్లు సాయం అందుతుందన్నారు. ఇళ్లు పూర్తిచేయడానికిగాను లబ్ధిదారుల ఖాతాలకు సొమ్ములు జమ చేస్తామన్నారు. ప్రభుత్వం అందించే సాయంతో ఇళ్లు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.