Share News

వ్యవసాయ యాంత్రీకరణకు ఊతం

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:36 AM

పంటల సాగులో కూలీల ఖర్చును తగ్గించడానికి వ్యవసాయ యాంత్రీకరణను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఐదు ఎకరాలకన్నా తక్కువ భూములు ఉన్న రైతులకు సబ్సిడీపై వివిధ రకాల పరికరాలు అందించడానికి ఏర్పాట్లు చేసింది.

వ్యవసాయ యాంత్రీకరణకు ఊతం
బ్రష్‌ కట్టర్‌ రైటప్‌: వరి పైరు, పశువుల మేత కోయడానికి వాడే యంత్రం

జిల్లాకు 1,679 యూనిట్లు మంజూరు

రూ.2.82 కోట్ల సబ్సిడీ

ఐదు ఎకరాలకన్నా తక్కువ భూములున్న రైతులకు లబ్ధి

రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

పంటల సాగులో కూలీల ఖర్చును తగ్గించడానికి వ్యవసాయ యాంత్రీకరణను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఐదు ఎకరాలకన్నా తక్కువ భూములు ఉన్న రైతులకు సబ్సిడీపై వివిధ రకాల పరికరాలు అందించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది జిల్లాకు 1,697 యూనిట్లు మంజూరుకాగా, రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ పరికరాలను రైతులు తమ సొంత అవసరాలకు వినియోగించుకోవడంతోపాటు తోటి రైతులకు కూడా తగిన రుసుముతో సేవలు అందించే అవకాశం వుంది.

గత కొంతకాలంగా ప్రభుత్వాలు, రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందిస్తున్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించకపోతే, గతంలో అమల్లో వున్న పథకాలను నిలిపివేసింది. అన్ని రకాల రాయితీలకు మంగళం పాడింది. ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్‌లకు ముందు యంత్ర పరికరాలు అందించేందుకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం, వాటిని బుట్టదాఖలు చేపడం పరిపాటిగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందులో భాగంగా వివిధ రకాల వ్యవసాయ పనులకు వినియోగించే యంత్రాలను రాయితీపై రైతులకు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. రైతులకు యంత్ర పరికరాల పంపిణీ బాధ్యతను ఏపీ స్టేట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది. యంత్ర పరికరం ధర ఎంత? దానిపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఎంత? రైతు చెల్లించాల్సిన సొమ్ము ఎంత? అన్న వివరాలను స్పష్టంగా పేర్కొన్నది.

జిల్లాకు 1,679 యూనిట్లు మంజూరు

వివిధ రకాల వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి జిల్లా 1,679 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో మందు పిచికారీ యంత్రాలు (బ్యాటరీ లేదా మాన్యువల్‌) 600 యూనిట్లు, మోటారు స్ర్పేయర్లు 300 యూనిట్లు, ట్రాక్టర్‌ డ్రమ్‌ ఆధారిత పరికరాలు 690 యూనిట్లు, రొటోవేటర్లు 24, పవర్‌ వీడర్లు 15, బ్రష్‌ కట్టర్లు 10, పవర్‌ టిల్లర్లు 40 యూనిట్లు. వీటికి సంబంధించి రైతులకు రూ.2.82 కోట్లు సబ్సిడీ ఇవ్వనున్నది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తాయి. గత వైసీపీ ప్రభుత్వం క్లస్టర్‌ హైరింగ్‌ కేంద్రాల ద్వారా రైతు సంఘాలకు పరికరాలను అరకొరగా అందించింది. అప్పట్లో రైతులు ముందుగా పరికరాల మొత్తం సొమ్ము చెల్లించేవారు. తరువాత ఎప్పటికో డీబీటీ విధానంలో రైతు సంఘాల బ్యాంకు ఖాతాలకు సబ్సిడీ సొమ్ము జమ అయ్యేది. కూటమి ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి చెప్పింది. రైతులు తమ వాటా సొమ్ము చెల్లిస్తే, ప్రభుత్వం ఆయా రైతుల తరుపున కంపెనీలకు వెంటనే సబ్సిడీ సొమ్మును జమ చేసి యంత్ర పరికరాలు రైతులకు అందేలా చర్యలు చేపట్టింది. ఐదు ఎకరాల్లోపు భూములున్న రైతులు ఈ పరికరాలు పొందడానికి అర్హులు.

రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు

సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు పొందాలనుకొనే రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.మోహన్‌రావు తెలిపారు. అక్కడ వుండే వ్యవసాయ సహాయకుడి లాగిన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయాధికారి ఆమోదం పొందిన తరువాత యంత్ర పరికరాలు పంపిణీ చేస్తారు. ఈ-కేవైసీ చేయించుకున్న రైతులు మాత్రమే రాయితీపై యంత్ర పరికరాలు పొందడానికి అర్హులు.

Updated Date - Mar 12 , 2025 | 12:36 AM