Share News

ఆక్వా రంగానికి ఊతం!

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:45 AM

ఆక్వా రంగం అభివృద్ధికి, తద్వారా ఆయా రైతులకు ప్రయోజనం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని రాంబిల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో కొత్తగా మూడు ఆక్వా జోన్లను ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మూడు మండలాల్లో మొత్తం 172.68 ఎకరాలను మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు నాన్‌-ఆక్వా జోన్‌లో వున్న ఈ భూములను ఆక్వా జోన్‌లోకి మారుస్తారు. ఆక్వా జోన్లలో రొయ్యలు, చేపల పెంపం చేపట్టే రైతులకు ప్రభుత్వం విద్యుత్‌పై రాయితీ ఇస్తుంది.

ఆక్వా రంగానికి ఊతం!
ఎస్‌.రాయవరం మండలం వాకపాడులో రొయ్యల చెరువులు

రాంబిల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో ప్రత్యేక జోన్‌లు

172.68 ఎకరాలను గుర్తించిన మత్స్య శాఖ

రొయ్యలు, చేపల పెంపకం చేపట్టే రైతులకు విద్యుత్‌పై సబ్సిడీ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఆక్వా రంగం అభివృద్ధికి, తద్వారా ఆయా రైతులకు ప్రయోజనం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని రాంబిల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో కొత్తగా మూడు ఆక్వా జోన్లను ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మూడు మండలాల్లో మొత్తం 172.68 ఎకరాలను మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు నాన్‌-ఆక్వా జోన్‌లో వున్న ఈ భూములను ఆక్వా జోన్‌లోకి మారుస్తారు. ఆక్వా జోన్లలో రొయ్యలు, చేపల పెంపం చేపట్టే రైతులకు ప్రభుత్వం విద్యుత్‌పై రాయితీ ఇస్తుంది.

గత వైసీపీ ప్రభుత్వం ఆక్వా రంగానికి చేయూత ఇవ్వకపోగా, మరిన్ని ఇబ్బందులకు గురిచేసింది. చేపలు, రొయ్యల పెంపకందారుల్లో కొద్దిమందికి మాత్రమే విద్యుత్‌ సబ్సిడీని అమలు చేసింది. మిగిలిన రైతులకు విద్యుత్‌ బిల్లుల భారం విపరీతంగా పెరిగిపోయి, ఆర్థికంగా నష్టపోయారు. దీంతో పలువురు రైతులు రొయ్యలు, చేపల పంపెకాన్ని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో 2023లో ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి అయిన నారా లోకేశ్‌ పాయకరావుపేటలో ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలు, ఇబ్బందులు చెప్పుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ అందిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. అంతేకాక ఆక్వా రంగం అభివృద్ధికి కొత్త జోన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని రాంబిల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో మత్స్య శాఖ గుర్తించిన 172.68 ఎకరాల్లో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు. వీటిని మూడు జోన్లుగా విభజిస్తారు. ఆయా జోన్‌లలో రొయ్యలు, చేపల పెంపకం చేపట్టే రైతులకు విద్యుత్‌ రాయితీ లభిస్తుంది. జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆక్వా రైతుల అభిప్రాయాలను సేకరించారు. తాజాగా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మత్స్య, వ్యవసాయ, నీటిపారుదల, కాలుష్య నియంత్రణ మండలి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆక్వా జోన్‌లలో రొయ్యలు, చేపల పెంపకం, రైతులకు అందించే రాయితీపై చర్చించారు. ఆక్వా జోన్‌ల పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు యూనిట్‌ విద్యుత్‌ రూపాయిన్నరకే సరఫరా చేస్తారు. కొత్తగా ఆక్వా జోన్ల ఏర్పాటు, విద్యుత్‌ సబ్సిడీ ప్రకటనపై ఆయా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి జి.విజయ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ, ఆక్వా జోన్‌లలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే చేపలు, రొయ్యల పెంపకం రైతుల ఆదాయాన్ని మెరుగుపర్చాలని నిర్ణయించామన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:45 AM