పొంగిన జాగారం గెడ్డ
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:55 AM
మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. జి.కోడూరు గ్రామంలో జాగారం గెడ్డ వరద పంట పొలాలపైకి విరుచుకుపడింది. దీంతో సుమారు 300 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. గెడ్డకు సమీపంలోని భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక, మట్టి, రాళ్లు మేటలు వేసినట్టు రైతులు చెబుతున్నారు.
300 ఎకరాల్లో నీట మునిగిన వరి
గెడ్డ సమీపంలోని భూముల్లో ఇసుక, మట్టి మేటలు
గత ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కారణమని రైతుల ఆరోపణ
మాకవరపాలెం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. జి.కోడూరు గ్రామంలో జాగారం గెడ్డ వరద పంట పొలాలపైకి విరుచుకుపడింది. దీంతో సుమారు 300 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. గెడ్డకు సమీపంలోని భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక, మట్టి, రాళ్లు మేటలు వేసినట్టు రైతులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు 2023లో తుఫాన్ సంభవించి భారీ వర్షాలు పడడంతో జి.కోడూరు వద్ద జాగారం గెడ్డకు గండి పడింది. కోత దశలో ఉన్న సుమారు 300 ఎకరాల్లో వరి పంట మొత్తం వదర పాలైంది. గండి పూడ్చాలన్న రైతుల విజ్ఞప్తిని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి సంఘం ఏర్పడింది. అయితే గండిని పటిష్ఠంగా పూడ్చడానికి నీటి సంఘం వద్ద నిధులు లేవు. ఖరీఫ్ ముగిసిన తరువాత పనులు చేపడతామని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో తుఫాన్ సంభవించి భారీ వర్షాలు కురవడంతో జాగారం గెడ్డ పొంగి, పంట పొలాలను ముంచేసింది. పొట్టదశలో ఉన్న వరిపైరు నీట మునిగింది. ఎకరాకు రూ.20 వేలకుపైగా పెట్టుబడిపెట్టామని, ఒక్కరూపాయి కూడా తిరిగి వచ్చే అవకాశం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. కాగా నీట మునిగిన వరి పొలాలను మండల వ్యవసాయ అధికారి డి.అప్పారావు గురువారం పరిశీలించారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత పంటనష్టాన్ని అంచనా వేస్తామని తెలిపారు.