మన్యంపై మంచు దుప్పటి
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:05 PM
మన్యంలో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. శీతాకాల వాతావరణం నెలకొనడంతో పొగమంచు దట్టంగానే కురిసింది.
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
చలికి వణుకుతున్న జనం
పాడేరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. శీతాకాల వాతావరణం నెలకొనడంతో పొగమంచు దట్టంగానే కురిసింది. దీంతో జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల దట్టంగా పొగమంచు కురిసింది. తాజా వాతావరణం పర్యాటకులకు కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా ఉంది. అలాగే అరకులోయ, వంజంగి, తాజంగి సందర్శనకు వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నది.
తగ్గుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
వాతావరణంలోని మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. జి.మాడుగులలో ఆదివారం 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, ముంచంగిపుట్టులో 7.7, డుంబ్రిగుడలో 8.2, అరకులోయలో 8.9, హుకుంపేటలో 9.6, చింతపల్లిలో 9.7, పెదబయలులో 10.2, పాడేరులో 10.9, కొయ్యూరులో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.