మన్యంపై మంచు దుప్పటి
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:47 AM
వాతావరణంలో మార్పులతో మన్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ పొగమంచు తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఏజెన్సీలో శనివారం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. తె
ఉదయం 9 గంటల వరకు దట్టంగా కమ్ముకున్న వైనం
వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి
పాడేరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పులతో మన్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ పొగమంచు తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఏజెన్సీలో శనివారం పొగమంచు దట్టంగా కమ్ముకుంది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కురవడంతో వాహనాలు సైతం లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో గత మూడు రోజులుగా వాతావరణం మారిపోయింది. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ చలి ప్రభావం తగ్గుతున్నది.
జి.మాడుగులలో 14.9 డిగ్రీలు
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వాతావరణం మారడంతో మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో శనివారం జి.మాడుగులలో 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, హుకుంపేటలో 15.2, ముంచంగిపుట్టులో 15.2, డుంబ్రిగుడలో 15.8, పెదబయలులో 16.0, అరకులోయలో 16.0, పాడేరులో 16.3, అనంతగిరి, చింతపల్లిలో 16.5, కొయ్యూరులో 19.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అధిక తేమ వల్లే పెరిగిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
చింతపల్లి: గిరిజన ప్రాంతంలో అధిక తేమ, మేఘావృతం వలనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మూడు రోజుల క్రితం గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదయ్యాయన్నారు. జి.మాడుగులతో అత్యల్పంగా 4.6, చింతపల్లిలో 6.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి వణికించిందన్నారు. ప్రస్తుతం అధిక తేమ(80- 90శాతం), మేఘావృతం నాలుగు అక్టాలు పెరగడంతో పాటు ఉత్తరాది నుంచి తేమతో కూడిన తూర్పు, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయన్నారు. దీంతో గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో 14.5 నుంచి 19.4 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. నవంబరు నెలాఖరు నుంచి వాతావరణంలో మార్పు వస్తుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు మళ్లీ ప్రారంభమవుతాయన్నారు. డిసెంబరు, జనవరిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.