మన్యంపై మంచు దుప్పటి
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:57 PM
వాతావరణంలోని మార్పులతో మన్యంలో శనివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది.
వాతావరణం మార్పులతో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
పాడేరు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): వాతావరణంలోని మార్పులతో మన్యంలో శనివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. గతకొన్ని రోజులుగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ ప్రభావంతో ముసురు వాతావరణం ఉండేది. ప్రస్తుతం శీతాకాల వాతావరణం నెలకొనడంతో పొగమంచు దట్టంగానే కురిసింది. దీంతో జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఎనిమిది గంటల వరకు ఎదుట వ్యక్తులు కన్పించలేదు. తాజా వాతావరణం పర్యాటకులు కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా ఉంది.
తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు
వాతావరణంలోని మార్పులతో మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇన్నాళ్లుగా సగటున గరిష్ఠ 29, కనిష్ఠ 21 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కాని శనివారం గరిష్ఠ 27, కనిష్ఠ 13.9 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో శనివారం జి.మాడుగులలో కనిష్ఠ ఉష్ణోగ్రత 13.9 డిగ్రీలు, అరకులోయలో 14.7, డుంబ్రిగుడలో 15.4, ముంచంగిపుట్టు, హుకుంపేటల్లో 15.7, పాడేరు, పెదబయలుల్లో 15.9, చింతపల్లిలో 16.0 డిగ్రీలుగా నమోదయ్యాయి.