గిరిజన విద్యకు పెద్దపీట
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:35 PM
గిరిజన విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు సంబంధించి గత మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భాషా పండితుల పదోన్నతులకు గురువారం కేబినెట్‌లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా 417 మంది భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి
ఒక్క పాడేరు ఐటీడీఏలోనే 140 మంది టీడబ్ల్యూ టీచర్లకు మేలు
నెరవేరిన మూడు దశాబ్దాల నాటి కల
పాడేరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు సంబంధించి గత మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భాషా పండితుల పదోన్నతులకు గురువారం కేబినెట్‌లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేస్తున్న గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల్లో తెలుగు, హిందీ భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పించాలని సుమారు మూడు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ పెద్దలు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. కానీ ఫలితం లేకపోయింది.
కేబినెట్‌లో ఆమోదంతో 417 మందికి ఎస్‌ఏలుగా పదోన్నతి
రాష్ట్రంలో ఐటీడీఏల ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న తెలుగు, హింధీ పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం, సీతంపేట, కేఆర్.పురం, చింతూరు, నెల్లూరు, శ్రీశైలంలోని ఐటీడీఏ కార్యాలయాల పరిధిలో పని చేస్తున్న 227 మంది తెలుగు పండితులు, 91 మంది హిందీ పండితులు, 99 మంది వ్యాయామ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు పొందారు. ఒక్క పాడేరు ఐటీడీఏ పరిధిలోనే 86 తెలుగు పండితులు, 18 మంది హిందీ పండితులు, 35 మంది వ్యాయామ ఉపాధ్యాయులు.. మొత్తం 140 మంది స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు పొందారు. అయితే ఇన్నాళ్లుగా పదోన్నతులకు నోచుకోని గిరిజన సంక్షేమ శాఖలోని భాషా పండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పించడంపై సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖాధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేగం సూర్యనారాయణ పేర్కొన్నారు.