Share News

గిరిజనాభివృద్ధికి పెద్దపీట

ABN , Publish Date - May 27 , 2025 | 12:29 AM

గిరిజనుల అభివృద్ధికి కేంద, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.

గిరిజనాభివృద్ధికి పెద్దపీట
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక శ్రద్ధ

వచ్చే నెల 15 నుంచి 30 వరకు పథకాలపై మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత అధికారులదే..

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, మే 26(ఆంధ్రజ్యోతి): గిరిజనుల అభివృద్ధికి కేంద, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గిరిజన దర్తీ అభా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్‌- 2025’లో భాగంగా సోమవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశం, వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. అందుకు గాను జూన్‌ 15 నుంచి 30వ తేదీ వరకు మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గిరిజనులకు ఆధార్‌, ఆయూష్మాన్‌ భారత్‌, పీఎం కిసాన్‌, జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు, పీఎం వన్‌దన్‌, అటవీ హక్కు పత్రాలు, పీఎం జన్‌మన్‌ వంటి వ్యక్తిగత పథకాలను అందించాలన్నారు. ఈ క్రమంలో ఏర్పడే అవాంతరాలను అధిగమించాలని, లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నారు. దీనికి ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా పథకాలపై లబ్ధిదారులైన గిరిజనులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు అవసరమైన అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గిరిజనులే స్వయంగా ఆయా పథకాలను పొందేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. అర్హులైన ఏ ఒక్క గిరిజనుడు నష్టపోకుండా ప్రభుత్వ పథకాలను పొందేలా అధికారులు బాధ్యత వహించాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో గిరిజనులకు సేవలందించే క్రమంలో స్వచ్ఛంద సంస్థ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఆయా కేంద్ర పథకాలను లబ్ధిదారులకు పక్కాగా అందించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు ఎంజే అభిషేక్‌గౌడ, కె.సింహాచలం, అపూర్వభరత్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నంద్‌, జిల్లా సెరీకల్చర్‌ అధికారి అప్పారావు, ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి, డ్వామా పీడీ విద్యాసాగరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మజీరావు, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 12:29 AM