ఆదిమ జాతి గిరిజనులకు పెద్దపీట
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:28 PM
మన్యంలో అత్యంత వెనుకబాటుకు గురైన ఆదిమ జాతి గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఏజెన్సీలోని ఆదిమ జాతి గిరిజనుల వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి ప్రధాన మంత్రి జన్‌మన్ పథకాన్ని అమలు చేస్తోంది. వీరికి 28,661 ఇళ్లను మంజూరు చేసింది.
పీఎం జన్‌మన్ యోజన పథకం కింద అభివృద్ధి పనులు
ఏజెన్సీ వ్యాప్తంగా 1,81,582 మంది
28,661 ఇళ్లు మంజూరు
146 ప్రాంతాలకు 424 కిలోమీటర్ల మేర తారు రోడ్ల నిర్మాణం
తాగునీటి సదుపాయం, అంగన్‌వాడీ కేంద్రాలు, మల్టీపర్పస్ భవన నిర్మాణాలు
అభివృద్ధిపై గిరిజనుల ఆనందం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో అత్యంత వెనుకబాటుకు గురైన ఆదిమ జాతి గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఏజెన్సీలోని ఆదిమ జాతి గిరిజనుల వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి ప్రధాన మంత్రి జన్‌మన్ పథకాన్ని అమలు చేస్తోంది. వీరికి 28,661 ఇళ్లను మంజూరు చేసింది. మారుమూల పల్లెల్లోని 146 ప్రాంతాలకు 424 కిలోమీటర్ల మేర తారు రోడ్లు నిర్మిస్తోంది. గ్రామాల్లో తాగునీటి సదుపాయం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, ఉచిత విద్యుత్ మీటర్లు అందిస్తోంది. దీంతో ఏజెన్సీలోని ఆదిమ జాతి గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పీఎం జన్‌మన్ యోజన పథకాన్ని ఈ ఏడాది సంక్రాంతి నాడు ప్రధాని మోదీ వర్చువల్ విఽధానంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆదిమజాతి గిరిజనుల అభివృద్ధికి కేంద్ర నిధులు అందిస్తుండగా, ఐటీడీఏ ద్వారా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఏడాది ముందు నుంచి(2023) దీనిపై ఐటీడీఏ అధికారులు కసరత్తు చేశారు. ఏజెన్సీ 11 మండలాల్లో ఏడున్నర లక్షల మంది గిరిజనులుండగా, వారిలో ఆదిమ జాతి గిరిజనులైన కోందు, పొరజ, గదబ తెగలకు చెందిన వారు లక్షా 81 వేల 582 మంది ఉన్నారని గుర్తించారు. దీంతో ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆదిమ జాతి గిరిజనులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి, వారి తాజా స్థితిగతులు, జీవన విధానం, వారి సమస్యలు, అవసరాలు, వారి భవిష్యత్తును మరింతగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై ఐటీడీఏ అధికారులు క్షేత్ర స్థాయి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. ఆయా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో ఆదిమ జాతి గిరిజనుల సమగ్రాభివృద్ధికి కేంద్ర పీఎం జన్‌మన్ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది.
గృహ నిర్మాణానికి తొలి ప్రాధాన్యం
ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో ఆదిమ జాతి గిరిజనులకు సొంతింటి నిర్మాణంపై అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఐటీడీఏ అధికారులు నిర్వహించిన సర్వే ఆధారంగా 28,661 కుటుంబాలకు ఇల్లు లేవని గుర్తించి, ఇళ్లను మంజూరు చేశారు. అలాగే ఒక్కో లబ్ధిదారుడికి యూనిట్ ధరగా రూ.2 లక్షల 39 వేలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.లక్ష ప్రోత్సాహంగా అందిస్తున్నది. అలాగే మారుమూల పల్లెల్లోని 146 ప్రాంతాలకు 424 కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ.393 కోట్ల వ్యయంతో తారురోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అలాగే ఆయా గ్రామాల్లోని గిరిజనులకు తాగునీటి సదుపాయాలను కల్పించేందుకు రూ.10 కోట్ల 43 లక్షల వ్యయంతో 1,816 పల్లెలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. 104 ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలను నిర్మిస్తుండగా, 13 వేల ఆదిమ జాతి గిరిజనుల ఇళ్లకు ఉచిత విద్యుత్ మీటర్లు, అవసరమైన లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి సమాచార సదుపాయాలు లేని 1,151 గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్, జియో, ఎయిర్ టెల్ సెల్ టవర్లను నిర్మిస్తున్నారు. ఆదిమ జాతి గిరిజన గ్రామాల్లో బహుళ ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు ఒక్కొక్క దానికి రూ.60 లక్షలు చొప్పున మొత్తం 35 బహుళ ప్రయోజన భవనాలను నిర్మిస్తున్నారు. ఆదిమ జాతి గిరిజనులు సేకరించే అటవీ/వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించి వారి ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు ఒక్కో వన్‌దన్ వికాస కేంద్రానికి రూ.15 లక్షలు కేటాయిస్తూ మొత్తం 18 వన్‌దన్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేకంగా బ్యాంకు రుణాలు, స్వయం ఉపాధికి రాయితీ రుణాలు, ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలైన నీరు, విద్యుత్ సదుపాయాలతో పాటు వీధుల్లో సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తున్నారు. ప్రధాన మంత్రి జన్‌మన్ పథకం అమలుతో ఆదిమ జాతి గిరిజనులు వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతారని ఐటీడీఏ ఏపీవో(పీవీటీజీ) ఎం.వెంకటేశ్వరరావు ’ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. కాగా జన్‌మన్ పథకం అమలుతో పలు సదుపాయాలు కలుగుతుండడంతో ఏజెన్సీలోని ఆదిమజాతి గిరిజనులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఐటీడీఏ పరిధిలో లబ్ధి పొందిన వారి వివరాలు
కొత్తగా 13,929 మందికి ఆధార్ నమోదు, పాత ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకున్నవారు 6,105 మంది. పీఎం గరీబ్ కల్యాణ యోజన లబ్ధిదారులు 982 మంది, పీఎం ఉజ్వల యోజన కింద 3,770 మందికి లబ్ధి చేకూరింది. ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందిన వాళ్లు 28,271 మంది, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోచన లబ్ధిదారులు 45,318 మంది, కిసాన్ క్రెడిట్ కార్డులు పొందిన వారు 7,033 మంది ఉన్నారు. పీఎం జన్‌దన్ యోజన 44,850 మందికి, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన 21,681 మందికి, పీఎం సురక్ష బీమా యోజన 42,784 మంది, పెన్షన్ యోజన లబ్ధిదారులు 5,847 మంది, పీఎం విశ్వకర్మ యోజన 318 మందికి అందాయి. సుకన్య సమృద్ధి యోజన 90 మందికి, పీఎం మాతృ వందన యోజన లబ్ధిదారులు 14,461 మంది, పీఎం సురక్షిత్ మంత్రియా అభియాన్‌లో 11,844 మందికి లబ్ధి చేకూరింది. పీఎం నేషన్ డయాలసిస్ ప్రోగ్రామ్ 3,555 మందికి, సికిల్ సెల్ ఎనీమియా మిషన్‌లో 59,056 మందికి, జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో 405 మందికి, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు 408 మందికి అందాయి.
---------------------
ఆదిమ జాతి గిరిజనుల వివరాలు
వ.సం మండలం గ్రామాలు కుటుంబాలు జనాభా
1. అనంతగిరి 76 1,593 5,382
2. అరకులోయ 94 3,012 11,557
3. చింతపల్లి 242 9,040 35,576
4, డుంబ్రిగుడ 73 1,781 7.513
5. జీకేవీధి 214 5,304 21,112
6. జి.మాడుగుల 211 4,984 22,142
7. హుకుంపేట 90 2,638 10,933
8. కొయ్యూరు 104 2,488 9,031
9. ముంచంగిపుట్టు 250 7,850 27,351
10. పాడేరు 99 2,949 11,148
11. పెదబయలు 164 5,170 19,837
-----------------------------------------------------------------------------------------------
మొత్తం 1,617 46,809 1,81,582
-----------------------------------------------------------------------------------------------