వ్యవసాయానికి పెద్దపీట
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:58 AM
వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రైతుల వ్యవసాయ ప్రగతికి సాంకేతిక సహకారం అందించేందుకు ప్రభుత్వం భూసార పరీక్షలు పునఃప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క మండలం నుంచి వ్యవసాయశాఖ అధికారులు 499 మట్టి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక భూసార పరీక్షలు పునఃప్రారంభం
మండలానికి 499 నమూనాలు సేకరణ
ఖరీఫ్ ప్రారంభానికి ముందే ఫలితాలు
గత వైసీపీ పాలనలో అటకెక్కిన పరీక్షలు
చింతపల్లి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రైతుల వ్యవసాయ ప్రగతికి సాంకేతిక సహకారం అందించేందుకు ప్రభుత్వం భూసార పరీక్షలు పునఃప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క మండలం నుంచి వ్యవసాయశాఖ అధికారులు 499 మట్టి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే ఫలితాలను రైతులకు అందజేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. భూసార పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూసార పరీక్షలు అటకెక్కాయి. ఐదేళ్ల కాలంలో భూసార పరీక్షలు నిర్వహించలేదు. తాజాగా పొలాల్లో పరీక్షలు చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు నాణ్యమైన పంటలు పండించాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. పంటలకు అవసరమైన సూక్ష్మపోషకాలు భూమిలో ఉండాలి. నేల ఆరోగ్యం, పోషక విలువలు ఏ స్థాయిలో ఉన్నాయని తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు చేయించుకోవాలి. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాల ఆధారంగా పోషకాల యాజమాన్యం చేపడితే వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించవచ్చు. ప్రధానంగా పంట పొలాల్లో సేకరించిన మట్టి పరీక్షించుకోవడం వల్ల భూమిలోనున్న పోషకాలు, లోపాలు రైతులకు తెలుస్తాయి. ఈ భూసార పరీక్షల ఆధారంగా పొలాల్లో నాటిన పంటలకు పోషకాలు(ఎరువులు) పెట్టుకోవడం వల్ల నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మట్టి నమూనాల సేకరణ
ప్రభుత్వం భూసార పరీక్షలు చేయించేందుకు మట్టి నమూనాల సేకరణ ప్రారంభించింది. భూసార పరీక్షల కోసం ‘సాయిల్ హెల్త్ కార్డు పోర్టల్’ పేరిట యాప్‌ను రూపొందించింది. జీపీఎస్ ఆధారంగా మట్టి నమూనాలు సేకరించిన చిత్రాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఫలితాలకు సంబంధించిన సమాచారం రైతుల సెల్‌ఫోన్‌కి ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ప్రస్తుతం ఈ నెల 15 నుంచి వ్యవసాయశాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల పరిధి రైతుల పంట పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరణ చేపడుతున్నారు. మే 15లోగా భూసార పరీక్షలు రైతులకు అందజేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది. రైతులకు భూసార పరీక్షల ఫలితాల కార్డులను అందజేస్తారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందుగానే రైతులకు భూసార పరీక్షల ఫలితాలు అందడం వల్ల పంటలకు అవసరమైన ఎరువులను ముందుగానే సిద్ధం చేసుకునే అవకాశం ఉంది.
భూసార పరీక్ష ఫలితాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆరు రకాల ప్రధాన ఫలితాలను రైతులకు అందజేస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలకు విశాఖపట్నంలో పరీక్షలు నిర్వహిస్తారు. భూమి(మట్టి)లోని ఉదజని సూచిక(పీహెచ్), లవణ సాంద్రత(ఈసీ), సేంద్రియ కర్బనం(ఓసీ శాతం), నత్రజని లభ్యత(కేజీ/హెక్టారు), భాస్వరం లభ్యత(కేజీ/హెక్టార్), పొటాషియం లభ్యత(కేజీ/హెక్టారు) ఫలితాలను రైతులకు తెలియజేస్తారు.