Share News

మద్యం షాపులకు బెల్టు దెబ్బ

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:05 AM

మద్యం బెల్టు దుకాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఆ ప్రభావం మద్యం దుకాణాలపై పడుతున్నది. వైన్‌ షాపులకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. బెల్ట్‌ షాపులు లేకపోవడంతో అనుకున్న మేర మద్యం అమ్మకాలు సాగడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే లాభాలతోపోలిస్తే.. లైసెన్స్‌ ఫీజు, షాపుల నిర్వహణ ఖర్చులు, అద్దెలు, సిబ్బంది జీతాలు అధికంగా వుంటున్నాయని, ఈ కారణంగా మద్యం షాపులను మూసివేసి, లైసెన్సులను వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.

మద్యం షాపులకు బెల్టు దెబ్బ
తురువోలు వైన్‌ షాప్‌: చీడికాడ మండలం తురువోలులో మూసివేసిన మద్యం దుకాణం

గొలుసు దుకాణాలపై ఎక్సైజ్‌ శాఖ ఉక్కుపాదం

అధికారిక షాపుల్లో లిక్కర్‌ అమ్మకాలపై ప్రభావం

గిట్టుబాటు కావడంలేదని చేతులెత్తేస్తున్న వ్యాపారులు

ఎక్సైజ్‌ అధికారులకు లైసెన్సులు అప్పగింత

పరవాడ మండలంలో ఇప్పటికే ఐదు షాపులు మూసివేత

చోడవరం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మద్యం బెల్టు దుకాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఆ ప్రభావం మద్యం దుకాణాలపై పడుతున్నది. వైన్‌ షాపులకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. బెల్ట్‌ షాపులు లేకపోవడంతో అనుకున్న మేర మద్యం అమ్మకాలు సాగడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే లాభాలతోపోలిస్తే.. లైసెన్స్‌ ఫీజు, షాపుల నిర్వహణ ఖర్చులు, అద్దెలు, సిబ్బంది జీతాలు అధికంగా వుంటున్నాయని, ఈ కారణంగా మద్యం షాపులను మూసివేసి, లైసెన్సులను వెనక్కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే పరవాడ మండలంలో ఐదు మద్యం షాపులు, చీడికాడ, పాయకరావుపేట మండలాల్లో ఒక్కో షాపు ఇప్పటికే మూతపడ్డాయి. తాజాగా చోడవరం మండలం గవరవరంలో మద్యం దుకాణాన్ని నిర్వహించలేమంటూ లైసెన్సును ఎక్జైజ్‌ అధికారులకు సరెండర్‌ చేశారు.

మద్యం దుకాణాల లైసెన్సు పొందిన వారిలో ఎక్కువశాతం మంది గ్రామీణప్రాంతంలో మద్యం అమ్మకాలపై ఒక అంచనా లేకుండా వ్యాపారంలోకి దిగారు. శివారు గ్రామాల్లో సైతం లైసెన్సు ఫీజు రూ.71 లక్షలు చెల్లించి మరీ దుకాణాలు ఏర్పాటు చేశారు. అంతకుముందు లైసెన్సు పొందడానికి ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున చెల్లించారు. మద్యం షాపును కచ్చితంగా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో పలువురు ఒక్కో దుకాణానికి ఐదు నుంచి పది వరకు దరఖాస్తు చేశారు. దీంతో దరఖాస్తు ఫీజుకు కనీసం రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ఇందులో ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. ఇక లాటరీ ద్వారా మద్యం దుకాణాలు పొందిన వ్యాపారులు లైసెన్సు ఫీజు, షాపునకు అడ్వాన్సు, ఇంటీరియర్‌ పనుల కోసం సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. ఇటీవల మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌ ఏర్పాటుకు మరో రూ.7.5 లక్షలు చెల్లించారు. చుట్టుపక్కల గ్రామాల్లో అనధికారిక బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలతో వ్యాపారం ఆశాజనకంగా వుంటుందని భావించారు. కానీ పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇచ్చిన తరువాత ప్రభుత్వం బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడా మద్యం బెల్టు షాపులు వుండడానికి వీల్లేదని ఎక్సైజ్‌ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో బెల్టు షాపులు క్రమేపీ మూతపడుతున్నాయి. ఆ ప్రభావం అధికారిక దుకాణాలపై పడి, మద్యం అమ్మకాలు సాధారణ స్థాయిలోనే జరుగుతున్నాయి. దీంతో అనుకున్న మేర ఆదాయం రావడంలేదు. రోజుకు కనీసం రూ.3 లక్షల మద్యం అమ్మకాలు సాగితే గిట్టుబాటు అవుతుందని, అంతకన్నా తక్కువ అయితే చేతి చమురు వదులుతుందని వ్యాపారులు అంటున్నారు. చోడవరం సర్కిల్‌ పరిఽధిలో 24 మద్యం దుకాణాలకుగాను రెండు, మూడు మినహా మిగిలిన వాటిలో కనిష్ఠంగా రూ.ఒక లక్ష, గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మద్యం వ్యాపారం చేయడంకంటే.. దుకాణాలను మూసివేసి, లైసెన్సులను వాపస్‌ చేయడం మంచిదని పలువురు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం కొత్త సంవత్సరం, సంక్రాంతి, ఆ తరువాత గ్రామ దేవతల పండుగల నేపథ్యంలో మద్యం అమ్మకాలు ఆశాజనకంగా వుంటాయన్న ఉద్దేశంతో వ్యాపారాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

ఇప్పటికే పలు దుకాణాలు మూసివేత

సబ్బవరం ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని పరవాడ మండలంలో ఇప్పటికే ఐదు మద్యం షాపులు మూతపడ్డాయి. పరవాడలో రెండు, వాడచీపురుపల్లిలో రెండు, కలపాకలో ఒక మద్య దుకాణాన్ని మూసివేశారు. చీడికాడ మండలం తురువోలు, పాయకరావుపేట పట్టణంలోని తాండవ షుగర్స్‌ రోడ్డులో ఒక్కో మద్యం షాపును పూర్తిగా మూసేశారు. చోడవరం మండలం గవరవరం మద్యం దుకాణాన్ని మూసివేయనున్నట్టు సంబంధిత లైసెన్సుదారులు ఇప్పటికే ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు.

గవరవరం షాపునకు రీ-నోటిఫికేషన్‌

కేవీపీ నాయుడు, ఎక్సైజ్‌ సీఐ, చోడవరం

గవరవరంలో మద్యం దుకాణం లైసెన్సును సరెండర్‌ చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గవరవరంలో మద్యం దుకాణం ఏర్పాటుకు రీ-నోటిఫికేషన్‌ ఇస్తాం. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం మా కార్యాలయంలో సంప్రదించవచ్చు.

Updated Date - Dec 05 , 2025 | 01:05 AM