Share News

కేజీహెచ్‌లో ఆధిపత్య పోరు!

ABN , Publish Date - May 19 , 2025 | 12:55 AM

ఉత్తరాంధ్ర ప్రజల పెద్దాస్పత్రిగా పేరొందిన కేజీహెచ్‌లో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

కేజీహెచ్‌లో ఆధిపత్య పోరు!

  • ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య నలిగిపోతున్న ఉద్యోగులు

  • ఒకరు ఔనంటే.. మరొకరు కాదంటుండడంతో తప్పని తిప్పలు

  • ఏడీ అకౌంట్‌లోకి జమ అయిన నగదు బదిలీ విషయంలో కోల్డ్‌ వార్‌

  • ఓ ఉన్నతాధికారి నోటి దురుసుతనానికి భయపడుతున్న చిరుద్యోగులు

విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర ప్రజల పెద్దాస్పత్రిగా పేరొందిన కేజీహెచ్‌లో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు యత్నిస్తుండడంతో ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగులంతా రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు సూపరింటెండెంట్‌ వర్గంలో ఉంటే, మరికొందరు అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌ వర్గంలో ఉన్నారు. ఇద్దరు ఉన్నతాధికారులు తమకు తెలియకుండా ఏమీ జరగకూడడని చెబుతుండడంతో ఉద్యోగులు ఏ పనీ చేయలేని దుస్థితిలో కొల్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్టు పలువురు చెబుతున్నారు. ఇరువురు అధికారుల కార్యాలయాల్లోకి ఎవరెవరు వెళుతున్నారన్న విషయాన్ని తెలుసుకోవడంపైనే వారు దృష్టి సారిస్తున్నారు. ఎవరైనా ఉద్యోగి ఒక అధికారి కార్యాలయం లోపలకు వెళ్లి వస్తే.. వెంటనే మరో అధికారి సదరు ఉద్యోగిని పిలిపించి ఏమిటి విషయం అని అడుగుతున్నట్టు పేర్కొంటున్నారు. ఆస్పత్రిలో తనిఖీలను కూడా ఇద్దరు అధికారులు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్న దాఖలాలు కూడా లేవని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు వచ్చే ముందు ఏర్పాటు చేసే సమావేశాల్లో కూర్చున్నా.. వీరిద్దరూ కలిసి చర్చించుకునే పరిస్థితులు లేవంటున్నారు. ఇద్దరి మధ్య పూడ్చలేని స్థాయిలో అగాధం కూరుకుపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో వివిధ పనులు నిర్వహించే కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యవహారాల్లోనూ వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తినట్టు పలువురు చెబుతున్నారు.

అలాగే కేజీహెచ్‌ డ్రాయింగ్‌ ఆఫీసర్‌ అకౌంట్‌లో సుమారు మూడు కోట్ల రూపాయలను హెచ్‌డీఎస్‌ అకౌంట్‌కు బదిలీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అడుగుతున్నారు. కానీ అలా చేయవద్దంటూ మరో అధికారి ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా నలుగుతున్నా పరిష్కారం మాత్రం లభించడం లేదని చెబుతున్నారు. జీ-1 సెక్షన్‌లో పనిచేసే ఉద్యోగిని మరో సీటుకు మారుస్తూ ఇప్పటికి రెండుసార్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ ఆ ఉత్తర్వులను అమలు కాకుండా మరో అధికారి అడ్డుచెప్పినట్టు తెలుస్తోంది. దీంతో సదరు ఉద్యోగి అక్కడే కొనసాగుతున్నారు. తాజాగా ఆస్పత్రి అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌ చాంబర్‌ వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాను ఏర్పాటు చేయించారు. ఆయన చాంబర్‌లోకి వెళ్లే ఉద్యోగుల గురించి తెలుసుకునేందుకే దీనిని ఏర్పాటు చేసినట్టు కింది స్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల తనిఖీ సమయంలోనూ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తుందని వారంటున్నారు. ఒక ఉన్నతాధికారి చెప్పినట్టు అక్కడి సిబ్బంది చేస్తే.. మరో అధికారి వచ్చి అలా చేయకూడదంటూ ఆదేశిస్తున్నారని చెబుతున్నారు. కాగా శానిటేషన్‌, సెక్యూరిటీ పనితీరు సరిగ్గా లేదని ఆస్పత్రి అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌ అనేకసార్లు సమావేశాలు పెట్టి సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. ఆ తరువాత కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కూడా వారితో పలు దఫాలు సమావేశాలు నిర్వహించి తన ఆదేశాలు పాటించాలని సూచించినట్టు తెలిసింది. ఆస్పత్రిలో తనకు తెలియకుండా ఏదీ జరగకూడదని సూపరింటెండెంట్‌ చెబుతుంటే.. తనకు సమాచారం లేకుండా పనులు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌ హెచ్చరిస్తున్నారు. దీంతో కేజీహెచ్‌లో పని చేసే ఉద్యోగులకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. ఏదైనా పని చేస్తే ఎవరేమంటారో అన్న సందిగ్ధంలో ఉద్యోగులు ఉండడంతో అనేక సేవలపై ప్రభావం పడుతున్నట్టు చెబుతున్నారు. కొన్ని కీలక ఫైళ్లు ముందుకు సాగడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.

నోటి దురుసుతనంతో ఇబ్బందులు..

ఒకవైపు ఇద్దరు ఉన్నతాధికారుల ఆధిపత్య పోరుతో ఇబ్బందులు పడుతుంటే.. కేజీహెచ్‌ ఉన్నతాధికారి నోటి దురుసుతనంతో మరికొంతమంది ఉద్యోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. కిందిస్థాయి సిబ్బంది పనితీరును మెరుగుపరిచే క్రమంలో ఆయన వినియోగిస్తున్న భాష కొంత ఎబ్బెట్టుగా ఉంటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సింగ్‌ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, శానిటేషన్‌, పలువురు వైద్య సిబ్బందికి ఆయన భాష ఇబ్బందికరంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. ఉన్నత స్థానంలో ఉన్న అధికారి మాట్లాడే తీరు ఇదేనా.. అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాక ఏదైనా పనిమీద ఆయన వద్దకు వస్తే ఎక్కువ సమయం నిరీక్షించేలా చేస్తున్నారని, దీనివల్ల తమ పనులకు జాప్యం కలుగుతోందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. కేజీహెచ్‌లో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారులు దృష్టిసారించి వాటిని చక్కదిద్దాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 19 , 2025 | 12:55 AM