Share News

97.5 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Oct 19 , 2025 | 10:56 PM

ఒడిశా నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న 97.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్టు చేశామని స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు.

97.5 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయి, వాహనాలు

పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న ఏడుగురి అరెస్టు, ఇద్దరు పరారీ

ఐదు వాహనాలు, ఎనిమిది సెల్‌ఫోన్లు, రూ.1,07,900 నగదు సీజ్‌

ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా

చింతపల్లి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న 97.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్టు చేశామని స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని నిజామాబాద్‌కి చెందిన నలుగురు వ్యక్తులు, చింతపల్లికి చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఒడిశా మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్‌ పరిధిలో గంజాయిని కొనుగోలు చేశారన్నారు. ఈ గంజాయిని రెండు వ్యాన్లలో అన్నవరం మీదుగా మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. అన్నవరం పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా స్థానిక సీఐ ఎం. వినోద్‌బాబు పర్యవేక్షణలో ఎస్‌ఐ వీరబాబు, పోలీసులు గొడ్డుగొర్రెలమెట్ట గ్రామంలో శనివారం సాయంత్రం వాహనాల తనిఖీలు ప్రారంభించారన్నారు. ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంలోనూ, వెనుక కారు, వ్యాన్‌లో మరికొందరు వస్తుండగా మార్గమధ్యంలో పోలీసులను గమనించి వెనక్కి వెళ్లిపోయే ప్రయత్నం చేశారన్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి బయటపడిందన్నారు. నిందితుల నుంచి రూ.1,07,900 నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు, వాహనాలు, గంజాయి స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామని ఆయన చెప్పారు. ఈ కేసులో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశామని, ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. ఈ సమావేశంలో సీఐ ఎం.వినోద్‌బాబు, ఎస్‌ఐ వీరబాబు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 10:57 PM