తొలి రోజు 93.49 శాతం పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:30 AM
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజైన సోమవారం 93.49 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించారు.
జిల్లాలో మొత్తం 1,22,132 మందికి గాను 1,14,404 మందికి అందజేత
పాడేరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజైన సోమవారం 93.49 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో మొత్తం 1,22,132 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.51 కోట్ల 35 లక్షల 17 వేలు విడుదల కాగా, తొలి రోజు సోమవారం రాత్రి 8 గంటల సమయానికి 1,14,404 మందికి రూ.48 కోట్ల 62 వేల 500 పెన్షన్ల సొమ్మును అందించారు. ఇంకా 7,728 మందికి పెన్షన్ సొమ్ము అందించాల్సి ఉంది. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 93.49 శాతంగా నమోదైంది. తొలి రోజు పెన్షన్ పొందని లబ్ధిదారులకు మంగళవారం అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని రంపచోడవరం డివిజన్ కేంద్రంలో పెన్షన్ పంపిణీలో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్, సబ్‌కలెక్టర్ శుభం నొక్వాల్, తదితరులు పాల్గొన్నారు. పాడేరు డివిజన్‌లోని అనంతగిరి మండలం కొండిభా, డముకు గ్రామాల్లో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, పాడేరు మండలం మినుములూరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, పాడేరు పీఏసీఎస్ చైర్మన్ డప్పోడి వెంకటరమణ, కాడెలి గ్రామంలో జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, పలువురు కూటమి నేతలు ఆయా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.