Share News

93.12 శాతం పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:03 AM

జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజు బుధవారం 93.12 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్‌ సొమ్మును అందించారు.

93.12 శాతం పింఛన్ల పంపిణీ
పాడేరు మండలం కందమామిడిలో వృద్ధుడికి పెన్షన్‌ సొమ్ము అందిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, పక్కన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

పాడేరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజు బుధవారం 93.12 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్‌ సొమ్మును అందించారు. మండలంలోని కందమామిడి గ్రామంలో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ బుధవారం పలువురు వృద్ధులకు పెన్షన్‌ సొమ్మును అందించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్‌ కేవలం సంక్షేమమే కాదని, ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో మొత్తం 1,22,507 మంది పెన్షన్‌ లబ్ధిదారులకు రూ.51 కోట్ల 64 లక్షల 48 వేలు విడుదల కాగా, తొలి రోజు బుధవారం రాత్రి 8 గంటల సమయానికి 1,14,082 మందికి రూ.47 కోట్ల 96 లక్షల 98 వేల 500 పెన్షన్ల సొమ్మును అందించారు. ఇంకా 8,425 మందికి పెన్షన్‌ సొమ్ము అందించాల్సి ఉంది. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 93.12. శాతంగా నమోదైంది. అలాగే తొలి రోజు పెన్షన్‌ పొందని లబ్ధిదారులకు గురువారం అందజేస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - Oct 02 , 2025 | 12:03 AM