Share News

ఉమ్మడి జిల్లాలో 93 హెచ్‌ఎం పోస్టులు ఖాళీ

ABN , Publish Date - May 22 , 2025 | 01:31 AM

ఉమ్మడి విశాఖ జిల్లాలో జడ్పీ, మునిసిపల్‌, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో 93 గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు జిల్లా విద్యా శాఖ గుర్తించింది. ఒక పాఠశాలలో ఐదేళ్ల సర్వీస్‌ పూర్తయిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో అటువంటి హెచ్‌ఎంలు 15 మంది ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలో 93 హెచ్‌ఎం పోస్టులు ఖాళీ

- బదిలీ కోసం దరఖాస్తుకు నేటి వరకూ గడువు

- ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌లో హెల్ప్‌డెస్క్‌

విశాఖపట్నం/ఆరిలోవ, మే 21 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖ జిల్లాలో జడ్పీ, మునిసిపల్‌, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో 93 గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు జిల్లా విద్యా శాఖ గుర్తించింది. ఒక పాఠశాలలో ఐదేళ్ల సర్వీస్‌ పూర్తయిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో అటువంటి హెచ్‌ఎంలు 15 మంది ఉన్నారు. గత ఏడాదిగా 46 ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎంలు పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఆ ఖాళీలను భర్తీచేస్తారు. జిల్లాలో 24 యూపీ పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయడంతో కొత్తగా 24 హెచ్‌ఎం పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇటీవల భీమిలి డైట్‌కు లెక్చరర్లుగా ఇద్దరు హెచ్‌ఎంలు వెళ్లడంతో ఆ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అలాగే బాలికల పాఠశాలల్లోని హెచ్‌ఎంలు ఆరుగురు బదిలీ కానున్నారు. దీంతో మొత్తం ఉమ్మడి జిల్లాలో 93 హెచ్‌ఎం పోస్టులు బదిలీల కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. ఒకేచోట ఐదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. లేకపోతే కేటగిరీ-4లో ఉన్న పోస్టులకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. బదిలీలకు గురువారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బదిలీల దరఖాస్తు చేసే సమయంలో సందేహాల నివృత్తికి సీతమ్మధారలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హెల్ప్‌ డెస్క్‌ పనిచేస్తుందని చెప్పారు.

Updated Date - May 22 , 2025 | 01:31 AM