తొలి రోజు 92.95 శాతం పెన్షన్ల పంపిణీ
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:19 AM
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజు సోమవారం 92.95 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించారు.
మొత్తం 1,22,876 మందికి గాను 1,14,213 మందికి అందజేత
పాడేరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజు సోమవారం 92.95 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో మొత్తం 1,22,876 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.51 కోట్ల 78 లక్షల 76 వేలు విడుదల కాగా, తొలి రోజు సోమవారం రాత్రి 8 గంటల సమయానికి 1,14,213 మందికి రూ.47 కోట్ల 95 లక్షల 56 వేల 500 పెన్షన్ల సొమ్మును అందించారు. ఇంకా 8,663 మందికి పెన్షన్ సొమ్ము అందించాల్సి ఉంది. తొలి రోజు పెన్షన్ పొందని లబ్ధిదారులకు మంగళవారం అందజేస్తామని అధికారులు తెలిపారు. కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ ఇతర పనుల్లో ఉండడంతో డీఆర్‌డీఏ పీడీ వి.మురళి పాడేరు మండలం తుంపాడలో పలువురు లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము అందించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతగిరిలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కూటమి నేతలు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు.