98 చోరీ కేసుల్లో 81 మంది అరెస్టు
ABN , Publish Date - May 21 , 2025 | 12:45 AM
గత నెలలో జరిగిన చోరీలకు సంబంధించి 81 మందిని నగర నేర పరిశోధన విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.కోటికిపైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
రూ.కోటికిపైగా విలువైన సొత్తు స్వాధీనం
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి):
గత నెలలో జరిగిన చోరీలకు సంబంధించి 81 మందిని నగర నేర పరిశోధన విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.కోటికిపైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీ శంఖబ్రతబాగ్చి వెల్లడించారు. ఏప్రిల్ నెలలో 123 చోరీ కేసులు నమోదుకాగా, వాటిలో 98 కేసులను ఛేదించామన్నారు. చోరీలకు పాల్పడిన 81 మందిని అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి 562 గ్రాముల బంగారం, 701 గ్రాముల వెండి, రూ.7.85 లక్షలు నగదు, 54 మోటార్ సైకిళ్లు, 380 సెల్‌ఫోన్‌లు, ఒక ల్యాప్‌టాప్, నాలుగు ఏసీలు, ఒక టీవీ, పది బ్యాటరీలు...మొత్తం రూ.1,00,53,580 విలువైన సొత్తును రికవరీ చేశామన్నారు. వాటిని బాధితులకు సీపీ చేతుల మీదుగా అందజేశారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, చోరీ సొత్తు లభ్యంకాగానే నేరుగా తమకు వాటిని అందజేయడం చాలా సంతోషంగా ఉందంటూ బాధితులు సీపీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ లతామాధురి, ఏడీసీపీ మోహనరావు, ఏసీపీ లక్ష్మణరావు, సీఐలు శ్రీనివాసరావు, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.