ఆర్టీసీ బస్సుల్లో 75 శాతం మహిళలే
ABN , Publish Date - Sep 24 , 2025 | 01:14 AM
‘స్త్రీశక్తి’ పథకం అమలు తరువాత ప్రయాణికుల్లో 75 శాతం మంది మహిళలు ఉంటున్నట్టు ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు చెబుతున్నారు.
లెక్కలు తేల్చిన విశాఖ రిజియన్ అధికారులు
స్త్రీశక్తి పథకం ప్రభావం
రోజుకు సగటున 4.1 లక్షల మంది ప్రయాణం అందులో మహిళలు 3.07 లక్షల మంది...
ద్వారకా బస్‌స్టేషన్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
‘స్త్రీశక్తి’ పథకం అమలు తరువాత ప్రయాణికుల్లో 75 శాతం మంది మహిళలు ఉంటున్నట్టు ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 22వ తేదీ వరకూ సగటున రోజుకు 4.1 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా, అందులో 3.07 లక్షల మంది మహిళలు ఉన్నట్టు గుర్తించారు.
రీజియన్‌లో ప్రస్తుతం 780 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఇందులో గరుడ, గరుడ ప్లస్, అమరావతి, నైట్‌రైడర్, డాల్ఫిన్ క్రూయిజ్, డీలక్స్, ఆలా్ట్ర డీలక్స్ సర్వీసులు 210 ఉన్నాయి. వీటిల్లో స్ర్తీశక్తి పథకం వర్తించదు. ప్రయాణికులంతా తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలి. దీంతో గతంలో ఆ బస్సుల్లో ప్రయాణించిన మహిళల్లో కొందరు స్త్రీశక్తి పథకం వర్తించే బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇక రీజియన్‌లో ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 570 నడుస్తున్నాయి. వాటిల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఆగస్టు 15కు ముందు రీజియన్‌లో రోజువారీ సగటున 3.1 లక్షల మంది ప్రయాణించేవారు. అందులో మహిళలు 1.5 లక్షలు, పురుషులు 1.6 లక్షల మంది ఉండేవారు. మహిళల కంటే పురుషులు పది వేల మంది ఎక్కువగా ప్రయాణించేవారు. స్త్రీశక్తి అమలైన తరువాత సగటున రోజుకు 4.1 లక్షల మంది ప్రయాణిస్తుండగా, అందులో 3.07 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుండగా, పురుషుల సంఖ్య 1.03 లక్షలకు తగ్గినట్టు అధికారులు లెక్కలు తేల్చారు.
నైట్ ఫుడ్‌కోర్టు పేరుతో వైసీపీ రాజకీయం
మళ్లీ వసూళ్లకు వ్యూహం
వ్యాపారులతో నేతల సమావేశం
కూటమికి చెందిన కొంతమంది నేతల సహకారం
విశాఖపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
ఆపరేషన్ లంగ్స్ (లైఫ్ టు సేవ్ అర్బన్ గ్రీన్ స్పేసెస్) పేరుతో జీవీఎంసీ అధికారులు నగరంలో రోడ్లు, పార్కులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే పాత జైలురోడ్డులో అనధికారికంగా కొనసాగుతున్న నైట్ ఫుడ్‌కోర్ట్‌ను తొలగించారు. దీనిపై కొందరు ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వచ్చినాసరే అధికారులు ముందుకువెళ్లారు. ఫుడ్‌కోర్టును తొలగించడాన్ని నిరసిస్తూ కొందరు వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని జేబులు నింపుకునేందుకు వైసీపీ నేతలు కొందరు వ్యూహం రూపొందించారు. వ్యాపారులకు మద్దతు పేరుతో వారితో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. వ్యాపారులంతా తమ వెంట నడిస్తే జీవీఎంసీ అధికారులను కలిసి దుకాణాలను తిరిగి అక్కడే ఏర్పాటుచేసుకునేందుకు అనుమతి ఇచ్చేలా ఒత్తిడి చేస్తామంటూ హామీ ఇచ్చారు. వైసీపీ నేతల మాటలు నమ్మిన కొందరు వ్యాపారులు రెండు రోజుల కిందట సూర్యాబాగ్‌లోని జోన్-4 కార్యాలయానికి వెళ్లారు. కనీసం నోటీసు ఇవ్వకుండా దుకాణాలను ఎలా తొలగిస్తారంటూ అక్కడ జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడును వైసీపీ నేతలు ప్రశ్నించారు. పండుగలోగా కౌన్సిల్/స్టాండింగ్ కమిటీ ఆమోదంతో అక్కడే ఫుడ్‌కోర్ట్‌ను తిరిగి ఏర్పాటుచేయించాలని డిమాండ్ చేశారు. జోనల్ కమిషనర్‌తో బలవంతంగా హామీ పత్రం రాయించి వ్యాపారులకు అందజేసేలా చేశారు. కూటమిలోని కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఫుడ్‌కోర్టులో వ్యాపారులకు అనుకూలంగా ఉండడంతో వారితో లోపాయికారీగా వైసీపీ నేతలు మాట్లాడి, వారి సూచన మేరకు వ్యాపారులను వెంటబెట్టుకుని జోనల్ కార్యాలయానికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. జోనల్ కమిషనర్‌కు కూటమి నేతలు కూడా ఫోన్ చేసి వైసీపీ నేతలు కోరినట్టు హామీ పత్రం రాసివ్వాలని, లేనిపక్షంతో తమ సత్తా ఏమిటో చూపిస్తామని బెదిరించారని, అందువల్లే ఆయనకు అధికారం లేకపోయినాసరే హామీ పత్రం ఇచ్చినట్టు చెబుతున్నారు. దుకాణాల ఏర్పాటు జరిగిన తర్వాత తమకు వ్యాపారుల నుంచి తలా ఇంత అని చెప్పి వసూలుచేసి ఇవ్వాలని...అక్కడ నాలుగైదు దుకాణాలు కలిగిన ఇద్దరు వ్యాపారులతో వైసీపీ నేతలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వీధి వ్యాపారుల సర్వే పూర్తి
ఎనిమిది జోన్‌ల పరిధిలో 18,041 మంది ఉన్నట్టు గుర్తింపు
వారిలో గుర్తింపు కార్డులు పొందినవారు 6,755 మంది మాత్రమే
అందరికీ దుకాణాలు పెట్టేందుకు 21 టౌన్ వెండింగ్ జోన్‌లు గుర్తింపు
విశాఖపట్నం, సెప్టెంబరు 23 (ఆంరఽధజ్యోతి):
నగరంలో రోడ్ల మార్జిన్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వ్యాపారులను లెక్కించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్రారంభించిన సర్వే పూర్తయ్యింది. ఎనిమిది జోన్‌ల పరిధిలో 18,041 మంది రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నట్టు యూసీడీ అధికారుల సర్వేలో తేలింది. వీరిలో స్టేట్ స్ట్రీట్ వెండింగ్ జోన్ యాక్ట్ ప్రకారం జీవీఎంసీకి డబ్బులు చెల్లించి గుర్తింపు కార్డులు పొందినవారు 6,755 మందేనని గుర్తించారు. గుర్తింపు కార్డులు పొందని వారికి కూడా కొత్తగా ఏర్పాటుచేసే స్ర్టీట్ వెండింగ్ జోన్‌లో వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. నగరంలో ఎనిమిది జోన్‌ల పరిధిలో స్ట్రీట్ వెండింగ్ జోన్‌ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు టౌన్‌ప్లానింగ్ అధికారులు సర్వే చేశారు. ఒక్కో జోన్‌లో మూడేసి ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు, జనజీవనానికి ఇబ్బందిలేకుండా దుకాణాలు ఏర్పాటుచేసుకోవచ్చునని ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతానికి 21 చోట్ల వెండింగ్ జోన్‌ల ఏర్పాటుకు జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించారు. ప్రభుత్వ అనుమతి రాగానే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరికొన్నిచోట్ల కూడా వెండింగ్‌జోన్‌లు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. కాగా నగరంలో రహదారులు, ఫుట్‌పాత్‌లు, ప్రధాన కూడళ్లలో ఆక్రమణలను తొలగించి ప్రజలకు రక్షణ, ఉత్తమ జీవన పరిస్థితులను కల్పించేందుకే ఆపరేషన్ లంగ్స్‌కు శ్రీకారం చుట్టామని యూసీడీ పీడీ సత్యవేణి ఒక ప్రకటనలో తెలిపారు. దీనిగురించి వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాపారుల సంక్షేమం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసి వారి జీవనోపాధికి ఇబ్బంది కలుగకుండా జీవీఎంసీ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆక్రమణలు తొలగింపుపై అపోహలు, వదంతులు, అసత్యప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. అర్హులైన వ్యాపారులందరికీ స్ర్టీట్ వెండింగ్‌జోన్ చట్టం ప్రకారం స్వేచ్ఛగా వ్యాపారం సాగించుకునే వెసులుబాటు కల్పించేందుకు కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రణాళికలు రూపొందించారని వివరించారు.
సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ కేంద్రంగా ఈసీబీసీ భవనం
ఇన్నోవేషన్, స్టార్టప్‌లకు ప్రోత్సాహం
నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
విశాఖపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సాగర్‌నగర్‌లో నిర్మించిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) భవనాన్ని ‘ఎనర్జీ ట్రాన్సిషన్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్’గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు శిక్షణ కార్యక్రమాల కోసం ఈపీడీసీఎల్ ఈ భవనాన్ని రూ.13.5 కోట్లతో నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.5 కోట్లు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ గ్రాంటుగా సమకూర్చింది. ఇప్పుడు ఈ భవనాన్ని సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌గా మార్చారు. దీని నిర్వహణకు అయ్యే మొత్తం వ్యయాన్ని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం ఒక సొసైటీని ఏర్పాటు చేసి, కమిటీ ఏర్పాటుచేయాలని సూచించారు. దానికి ఇంధన శాఖ కార్యదర్శి చైర్మన్‌గా, ఈపీడీసీఎల్ సీఎండీ వైస్ చైర్మన్‌గా, మిగిలిన డిస్కమ్‌ల సీఎండీలు సభ్యులుగా ఉంటారు. ఈపీడీసీఎల్ హెచ్‌ఆర్‌డీ మెంబర్ కన్వీనర్‌గా, ఏయూ, ఐఐఎం, ఐఐపీఈ, డీఎస్‌ఎన్‌ఎల్‌యూ వంటి విద్యా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
ఇదీ లక్ష్యం
సస్టెయినబుల్ ఎనర్జీ కోసం ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్‌గా పనిచేస్తుంది. పరిశోధనలకు పెద్దపీట వేస్తుంది. పారిశ్రామిక అవసరాలకు తగినట్టుగా స్కిల్ డెవలప్‌మెంట్, కెపాసిటీ బిల్డింగ్ కోసం కార్యక్రమాలు చేపడుతుంది. విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వం, ప్రజా సంఘాల మధ్య వారధిగా ఉంటుంది. డేటా ఆధారంగా పైలట్ ప్రాజెక్టులు చేపడుతుంది. ఎనర్జీ రంగంలో ఇంకుబేషన్ సెంటర్లను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుంది. రెన్యువబుల్ ఎనర్జీ, స్టోరేజ్ విధానాలను ఇంటిగ్రేట్ చేయడానికి యత్నిస్తుంది. రూఫ్ టాప్ సోలార్, మైక్రో గ్రిడ్లు, ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్‌కు మౌలిక వసతులు, గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్‌లు, అధ్యయనాలు చేపడుతుంది. ఉద్యోగ అవకాశాలు పెంచుతుంది.