736 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:34 AM
జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు సోమవారం తనిఖీలు చేసి 736 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, మొత్తం 22 మందిని అరెస్టు చేశారు. మాడుగులలో 320 కిలోలతో 16 మంది, నర్సీపట్నంలో 216 కిలోలతో ముగ్గురు, పాయకరావుపేటలో 200 కిలోలతో ముగ్గురు పట్టుబడ్డారు.
మాడుగులలో 320, నర్సీపట్నంలో 216, పాయకరావుపేటలో 200 కిలోలు
మొత్తం 22 మంది అరెస్టు
మాడుగుల/నర్సీపట్నం/పాయకరావుపేట, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు సోమవారం తనిఖీలు చేసి 736 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, మొత్తం 22 మందిని అరెస్టు చేశారు. మాడుగులలో 320 కిలోలతో 16 మంది, నర్సీపట్నంలో 216 కిలోలతో ముగ్గురు, పాయకరావుపేటలో 200 కిలోలతో ముగ్గురు పట్టుబడ్డారు. ఈ వివరాలను ఆయా ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం వెల్లడించారు. మాడుగులలో అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఒడిశాలో కొనుగోలు చేసిన 320 కిలోల గంజాయిని జిల్లాలోని వి.మాడుగుల మండలం శంకరం పంచాయతీ బొడ్డరేవు గ్రామ సమీపంలో ఆటోలో లోడ్ చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. ముందస్తు సమాచారం మేరకు మాడుగుల ఎస్‌ఐ జి.నారాయణరావు సిబ్బందితో అక్కడ మాటు వేసి గంజాయిని స్వాధీనం చేసుకుని, 16 మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారయ్యారు. పట్టుబడిన వారిలో అల్లూరి జిల్లా జి.మాడుగులకు చెందిన దుక్కేరి బుజ్జిబాబు, పెదబయలు మండలానికి చెందిన దలాయి చంటిబాబు, పాడేరు మండలానికి చెందిన కిల్లో కొండబాబు, జి.మాడుగుల మండలానికి చెందిన వంతల సతీశ్, వంతల అశోక్, వంతల నాగరాజు, కిల్లో చిరంజీవి, కొర్ర చిన్నారావు, వంతల గణేశ్, కొర్రా జగన్, కొర్రా తిరుపతి, పాంగి రాంబాబు, చింతపల్లి మండలానికి చెందిన కిల్లో సింహాద్రి, కొర్రా చందర్రావు, వి. మాడుగుల మండలం శంకరం పంచాయతీ తాడివలసకు చెందిన పాగి ఈశ్వరావు, వంతల కిశోర్‌లు ఉన్నారు. వీరిని అరెస్టు చేసి మంగళవారం సాయంత్రం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
నర్సీపట్నంలో 216 కిలోలు..
నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని గొలుగొండ మండలం కొమిర శివారు ప్రాంతంలో పోలీసులు 216 కిలోల గంజాయిని పట్టుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. మంగళవారం డీఎస్పీ శ్రీనివాసరావు అందించిన వివరాలు ఇలా ఉన్నారు. ముందుగా అందిన సమాచారంతో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, నర్సీపట్నం రూరల్, గొలుగొండ ఎస్‌ఐలు రాజారావు, రామారావు కొమిర శివారు ప్రాంతంలో నిఘా పెట్టారు. ఆ సమయంలో వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా 216 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితులు ఒడిశా రాష్ట్రం చిత్రకొండలో గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకు రవాణా చేయడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరుకి చెందిన తరుణ్‌కుమార్, చింతపల్లి మండలం దోమలగొంది గ్రామానికి చెందిన గడుగు కొండబాబు, చిత్లూరు జిల్లా సత్యవేడుకి చెందిన డ్రైవర్ ఎ.దినేశ్ ఉన్నారు.
పాయకరావుపేటలో 200 కిలోలు
పాయకరావుపేట మండలంలోని సీతారాంపురం జంక్షన్ వద్ద పోలీసులు సోమవారం 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. మంగళవారం పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో నర్సీపట్నం డీఎస్పీ కె.శ్రీనివాస్ ఈ వివరాలు వెల్లడించారు. గొలుగొండ మండలం రావణాపల్లి సమీపంలో ఏటిగైరమ్మపేట గ్రామానికి చెందిన గంజాయి స్మగ్లర్ గొర్లి గంగునాయుడు ఇటీవల ఒడిశా నుంచి ఏజెన్సీలోని లంబసింగికి తెచ్చిన 200 కిలోల గంజాయిని ఆటోలో గబ్బాడ మీదుగా నర్సీపట్నం తీసుకువచ్చి అక్కడి నుంచి కారులో నక్కపల్లి మండలం నెల్లిపూడి గ్రామంలో ఒక తోటలో డంప్ చేశాడు. దీనిని సోమవారం పశ్బిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామానికి చెందిన బైపురెడ్డి రత్నం కారులో రాజమహేంద్రవరానికి తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో పాయకరావుపేట సీఐ జి.అప్పన్న, ఎస్‌ఐ పురుషోత్తం తమ సిబ్బందితో మండలంలోని సీతారాంపురం జంక్షన్ వద్ద పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని బైపురెడ్డి రత్నంతోపాటు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటకు చెందిన ఎర్రమిల్లి నాగవీరశివ, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన కోళ్ల నాగసతీశ్‌లను అరెస్టు చేశారు.