73,000
ABN , Publish Date - May 04 , 2025 | 12:55 AM
అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలకు అన్ని విధాలుగా చేయూతనిచ్చేందుకు చేపట్టిన పీ-4 సర్వేలో జిల్లాలో 73 వేల బంగారు కుటుంబాలను అధికారులు గుర్తించారు.
ఇదీ జిల్లాలో నిరుపేద కుటుంబాల సంఖ్య
పీ-4 సర్వేలో గుర్తించిన అధికారులు
బంగారు కుటుంబాలుగా నామకరణం
ప్రతి కుటుంబానికి బాసటగా నిలిచేందుకు మార్గదర్శకుల ఎంపిక కోసం కసరత్తు
విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):
అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలకు అన్ని విధాలుగా చేయూతనిచ్చేందుకు చేపట్టిన పీ-4 సర్వేలో జిల్లాలో 73 వేల బంగారు కుటుంబాలను అధికారులు గుర్తించారు. వారిని అన్నివిధాలా ఆదుకునేందుకు మార్గదర్శకులుగా జిల్లాలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, విదేశాలలో నివాసం ఉంటున్న వారిని ఎంపిక చేయనున్నారు.
రాష్ట్రస్థాయిలో ప్రతి జిల్లాలో బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఆయా ప్రాంతాల్లో ఉన్నత వర్గాలు అంటే ఆర్థికంగా స్థితిమంతులను మార్గదర్శకులుగా గుర్తించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రూపకల్పన చేశారు. ఇందుకుగాను అన్ని జిల్లాల్లో పీ-4 సర్వే రెండు నెలల క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం సర్వే దాదాపు చివరి దశకు వచ్చింది. పీ-4 సర్వే కోసం పలు రకాల ప్రామాణికాలు, సంక్షేమ పథకాలను పరిగణనలోకి తీసుకుని 4,09,948 కుటుంబాలతో జాబితా రూపొందించారు. ఈ 4,09,948 కుటుంబాల్లో ఇంతవరకూ 4,08,161 (99.6 శాతం) కుటుంబాలను సర్వే చేశారు. ఇతరుల నుంచి పలు విధాలుగా సాయం పొందేందుకు 3,10,925 కుటుంబాలు మాత్రమే ముందుకు వచ్చాయి. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. అయితే ప్రభుత్వం 3,10,925 వేల కుటుంబాల జాబితాను మరింత వడపోసి సమాజంలో అత్యంత పేదలుగా ఉన్న 73,000 కుటుంబాలను ఎంపిక చేసింది. విద్యాపరంగా, జీవన స్థితిగతులపరంగా 73 వేల కుటుంబాలు అత్యంత పేదలుగా నిర్ధారించింది. ఈ కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ప్రభుత్వం నామకరణం చేసింది. వీరిలో అత్యధికులు మురికివాడల్లో నివాసం ఉంటున్నవారు, అపార్టుమెంట్‌లలో పనిచేసే వాచ్‌మెన్‌లు, భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలు, ఇతరత్రా చిన్నచిన్నపనులు చేసుకునేవారు ఉన్నారు. ఇటువంటి కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుకోవడం ద్వారా పేదరికం నుంచి బయటకు తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఇటువంటి కుటుంబాల్లో పిల్లలకు మంచి చదువు అందించడం, ఉద్యోగాల కోసం నాణ్యమైన శిక్షణ ఇప్పించడం, వారు నివసిస్తున్న ఇంటిలో చక్కని జీవనానికి వీలుగా వసతులు కల్పించడం, ఆదాయం పెంపొందించేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయడం, ఇతరత్రా ప్రోత్సాహం అందజేసేందుకు మార్గదర్శకులను ఎంపికచేయాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని జిల్లాల మాదిరిగా విశాఖ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో ప్రధానంగా నగరంలో పారిశ్రామికవేత్తలు, పెద్ద వ్యాపారులు, బిల్డర్లు, వైద్యులు, లాయర్లు, ఇతరత్రా ఉన్నత వర్గాలు, ఎన్‌ఐఆర్‌లను మార్గదర్శకులుగా గుర్తించే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలతో కలెక్టర్ త్వరలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బంగారు కుటుంబాలకు ఏ విధంగా ఆదుకోవాలి అనేదానిపై మార్గదర్శకులకు దిశానిర్దేశం చేయనున్నారు.