Share News

59 చోరీ కేసుల్లో 73 మంది అరెస్టు

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:20 AM

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత నెల (జూన్‌) 84 చోరీలు జరిగితే వాటిలో 59 కేసులను ఛేదించినట్టు సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు.

59 చోరీ కేసుల్లో 73 మంది అరెస్టు

రూ.1.06 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

బాధితులకు అందజేత

విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత నెల (జూన్‌) 84 చోరీలు జరిగితే వాటిలో 59 కేసులను ఛేదించినట్టు సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు. ఆ కేసుల్లో రికవరీ చేసిన సొత్తును గురువారం కమిషనరేట్‌ ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగిన క్రైమ్‌ మేళాలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నేరాల నియంత్రణకు ఒక వైపు ముందస్తు చర్యలు తీసుకుంటూనే, మరోవైపు నమోదైన చోరీ కేసులను త్వరితగతిన ఛేదించేందుకు క్రైమ్‌ విభాగం అధికారులు, సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. గత నెల నగరంలో 84 చోరీలు జరిగితే వాటిలో 59 కేసులను ఛేదించామన్నారు. ఆయా కేసుల్లో నేరాలకు పాల్పడిన 73 మందిని అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తును రికవరీ చేశామన్నారు. అరెస్టు అయినవారి నుంచి 1,204 గ్రాముల బంగారం, 427.8 గ్రాముల వెండి, 5.67 లక్షల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, 430 సెల్‌ఫోన్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు, రెండు యాపిల్‌ ఐపాడ్స్‌, రూ.93 వేలు విలువైన రాగివైరు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.1.06 కోట్లు ఉంటుందన్నారు. గత ఏడాది కాలంలో చోరీకి గురైన సెల్‌ఫోన్లలో 3,330 ఫోన్‌లను గుర్తించి బాధితులకు అందజేశామన్నారు. అనంతరం చోరీ కేసుల్లో బాధితులకు వారు పోగొట్టుకున్న నగలు, సొత్తును సీపీ చేతులు మీదుగా అందజేశారు. చోరీకి గురైన సొత్తును నిందితుల నుంచి పోలీసులు రికవరీ చేసి తమకు అందజేయడం ఆనందంగా ఉందని బాధితులు సంతోషం వ్యక్తంచేశారు. సీపీతోపాటు పోలీస్‌ అధికారుల కృషిని అభినందించారు. అనంతరం నగర ఏఆర్‌ విభాగంలో బ్యాండ్‌పార్టీకి కొత్తగా కొనుగోలుచేసిన సంగీత పరికరాలను సీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్‌ డీసీపీ లతామాధురి, ఏసీపీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

------------------------------------------

ముసురు

జల్లులతో చల్లబడిన వాతావరణం

నేడు, రేపు వర్షాలు

విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గురువారం నగరంలో ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మేఘాలు ఆవరించాయి. మధ్యాహ్నం మూడు గంటల తరువాత చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. రాత్రి వరకూ కొనసాగాయి. శుక్రవారం జిల్లాలో వర్షం కొనసాగుతుంది. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

------------------------------------------

రత్నాచల్‌ సహా పలు ఎక్స్‌ప్రెస్‌, పాసింజర్‌ రైళ్లు రద్దు

విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం నగర శివారునున్న తాడి-దువ్వాడ స్టేషన్ల మధ్య నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌, ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్టు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ఈనెల 26, 28, 30 తేదీల్లో విశాఖ-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717), విజయవాడ-విశాఖ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12718), రాజమండ్రి-విశాఖ మెము పాసింజర్‌ (67285), విశాఖ-రాజమండ్రి మెము పాసింజర్‌ (67286), కాకినాడ-విశాఖ మెము పాసింజర్‌ (17267), విశాఖ-కాకినాడ మెము పాసింజర్‌ (17268), ఈనెల 26, 30 తేదీల్లో గుంటూరు-విశాఖ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22876), విశాఖ-గుంటూరు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22875)లను రద్దు చేశామని పేర్కొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 01:20 AM