రెవెన్యూ క్లినిక్‌కు 72 వినతులు
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:18 AM
సుదీర్ఘకాలంగా నలుగుతున్న రెవెన్యూ సమస్యలకు వేగంగా పరిష్కారాన్ని చూపించడమే రెవెన్యూ క్లినిక్‌ల ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.
సమస్యలకు వేగంగా పరిష్కారం చూపించడమే లక్ష్యం
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
సుదీర్ఘకాలంగా నలుగుతున్న రెవెన్యూ సమస్యలకు వేగంగా పరిష్కారాన్ని చూపించడమే రెవెన్యూ క్లినిక్‌ల ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌తోపాటు ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలకు వేగవంతమైన పరిష్కారాన్ని అందించేందుకు రెవెన్యూ క్లినిక్‌లు దోహదపడతాయన్నారు. ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులంతా ఒకేచోట ఉండి సమాధానం చెప్పడం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలను, లక్ష్యాలను అర్థం చేసుకుని పనిచేయాలని అధికారులకు సూచించామన్నారు. కాగా, రెవెన్యూ క్లినిక్ కోసం కలెక్టరేట్ కింది భాగంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయడంతోపాటు దరఖాస్తులు నింపేందుకు సహాయకులను నియమించారు. అధికారుల ఎదుట ప్రజలు కూర్చుని సమస్య చెప్పుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. సమస్యలకు సంబంధించిన వివిధ కేటగిరీల వారీగా టేబుళ్లను ఏర్పాటుచేశారు.
రెవెన్యూ క్లినిక్‌కు 72 వినతులు
తొలిసారి నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌కు 72 వినతులు వచ్చాయి. ప్రభుత్వ భూములు, జిరాయితీ భూముల ఆక్రమణ, అసైన్‌మెంట్, జీవో 296 ప్రకారం క్రమబద్ధీకరణ, 22ఏ జాబితా నుంచి భూములు తొలగింపు, తదితర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అందులో ఉన్నాయి.
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం
విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ (18189)లో అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో సోమవారం ఉదయం పలు రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. పూరి-తిరుపతి (17479) సుమారు మూడు గంటలసేపు దువ్వాడ స్టేషన్‌లో నిలిచిపోయింది. ఈ రైలు సోమవారం ఉదయం సుమారు 4.00 గంటలకు దువ్వాడ చేరి, 7.00 గంటల సమయంలో తిరిగి బయలుదేరింది. ఇక హౌరా-తిరుచునాపల్లి ఎక్స్‌ప్రెస్ (12663) ఉదయం 7.20 గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరి, తిరిగి 9.00 గంటలకు బయలుదేరింది. సుమారు గంటన్నర సేపు విశాఖ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. అలాగే మల్దా టౌన్-బెంగళూరు అమృతభారత్ (13434) ఉదయం 5.50 గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరి తిరిగి 7.50 గంటలకు బయలుదేరింది. సుమారు రెండు గంటలు ఇక్కడ నిలిచిపోయింది. హటియా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12835) ఉదయం 8.55 గంటలకు విశాఖ చేరి, తిరిగి 9.35 గంటలకు బయలుదేరింది. ప్రమాద ఘటనపై రైల్వే అధికారులు స్పందించి పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో మిగిలిన రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగించాయి.
నేటి నుంచి అరకు ప్రత్యేక రైలు
విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మంగళవారం నుంచి జనవరి 18వ తేదీ వరకూ విశాఖ-అరకులోయ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్టు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. 08525 నంబరు గల రైలు ఈ నెల 30 నుంచి జనవరి 18 వరకు ప్రతిరోజు ఉదయం 8.40 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు అరకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08526 నంబరు గల రైలు ఈ నెల 30 నుంచి జనవరి 18 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు అరకులో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుతుంది.