Share News

2 నెలల్లో 70 వేల సూర్యఘర్‌ యూనిట్లు

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:57 AM

జిల్లాలో వచ్చే రెండు నెలల్లో విస్తృత ప్రచారం నిర్వహించి పీఎం సూర్యఘర్‌ పథకం కింద 70 వేల యూనిట్లు అమర్చాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ సూచించారు.

2 నెలల్లో 70 వేల సూర్యఘర్‌ యూనిట్లు

అసెంబ్లీ నియోజకవర్గానికి పదేసి వేలు లక్ష్యం

కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌

విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో వచ్చే రెండు నెలల్లో విస్తృత ప్రచారం నిర్వహించి పీఎం సూర్యఘర్‌ పథకం కింద 70 వేల యూనిట్లు అమర్చాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ సూచించారు. కలెక్టరేట్‌లో పీఎం సూర్యఘర్‌ పథకంపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పది వేల యూనిట్లు లక్ష్యం చేరుకోవాలన్నారు. విద్యుత్‌, గ్రామ సచివాలయాల కార్యదర్శులు ఈ పథకం ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పథకం, వ్యయం, ప్రభుత్వ రాయితీ, తగ్గనున్న విద్యుత్‌ బిల్లుల వంటి అంశాలను వివరించాలన్నారు. దీనికి సహకరించే గ్రామ, వార్డు కార్యదర్శులకు వెండర్ల ద్వారా ఇన్సెంటివ్‌లు అందిస్తామన్నారు. ఈపీడీసీఎల్‌ విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈ శ్యాంబాబు మాట్లాడుతూ, కిలోవాట్‌కు రూ.65 వేలు ఖర్చు అవుతుందని, రూ.30 వేలు రాయితీ లభిస్తుందని, 150 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇంటిపైన గానీ, ఖాళీ స్థలంలో గానీ 10/10 అడుగుల స్థలం సరిపోతుందన్నారు. ఒక్కసారి పెట్టుబడి పెడితే 20 ఏళ్ల వరకూ విద్యుత్‌ భారం ఉండదన్నారు. సమావేశంలో జేసీ మయూర్‌ అశోక్‌, జెడ్పీ సీఈఓ నారాయణమూర్తి, జోనల్‌ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.


రెవెన్యూ వివాదంపై ప్రభుత్వం ఆగ్రహం

విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం తలెత్తడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్‌ భవానీశంకర్‌పై విశాఖ ఆర్డీవో పి.శ్రీలేఖ రెండు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ శాఖలో నెలకొన్న విభేదాలపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలు అసహనం వ్యక్తం చేశారని సమాచారం. అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్‌ డేటా సెంటర్‌ విశాఖలో ఏర్పాటుకానున్న నేపథ్యంలో నగరం పేరు అంతర్జాతీయంగా మార్మోగుతుంది. ఇటువంటి సమయంలో రెవెన్యూ శాఖలో ఇద్దరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉందని చెబుతున్నారు. వివాదానికి తెరదించాలని రెవెన్యూ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Updated Date - Oct 19 , 2025 | 12:57 AM