విశాఖకు 60 వేల మంది
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:52 AM
60 thousand people to Visakhapatnam
ఫోటో: 19ఏకేపీ.1. యోగా దినోత్సవానికి వెళ్లేందుకు కేటాయించిన చేసిన బస్సులో ట్రయల్ నిర్వహిస్తున్న డీఆర్‌ఓ సత్యనారాయణ, అధికారులు
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి జిల్లా నుంచి తరలింపు
30 వేల మంది విద్యార్థులు, 25 వేల మంది ఫార్మా ఉద్యోగులు, కార్మికులు
విద్యార్థులు, సాధారణ ప్రజల కోసం 825 ప్రత్యేక బస్సులు
నేటి సాయంత్రానికి ఎంపిక చేసిన కేంద్రాలకు తరలింపు
రాత్రికి ఇక్కడే బస, భోజనం
శనివారం తెల్లవారుజామున విశాఖకు పయనం
మండలాల వారీగా రూట్లు ఖరారు
కార్యక్రమం పూర్తయిన తరువాత తిరిగి స్వస్థలాలకు చేరిక
జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో ఈనెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి జిల్లా నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సాధారణ ప్రజలు తరలి వెళ్లనున్నారు. వీరిని జిల్లాలో ఎంపిక చేసిన విడిది కేంద్రాలకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక బస్సుల్లో చేరుస్తారు. రాత్రికి ఇక్కడే భోజనం, వసతి సదుపాయాలు కల్పించి, శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు బస్సుల్లో విశాఖ తీసుకెళతారు. అక్కడ యోగా దినోత్సవ వేడుకలు పూర్తయిన తరువాత తిరిగి బస్సుల్లో ఎక్కించి స్వస్థలాలకు చేరుస్తారు. ఈ మేరకు జిల్లా నుంచి సుమారు 60 వేల మందిని విశాఖకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
విశాఖ వేదికగా ఈ నెల 21న నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్న విషయం తెలిసిందే. యోగాంధ్ర-2025 వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ యంత్రాంగం.. రెండు వారాల క్రితమే ఏర్పాట్లు మొదలు పెట్టింది. విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో అనకాపల్లి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొనేలా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లా నుంచి విద్యార్థులు, ఫార్మా కంపెనీల ఉద్యోగులు, కార్మికులు, సాధారణ ప్రజలు కలిపి మొత్తం 60 వేల మంది యోగాంధ్ర వేడుకలకు హాజరు కానున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆరో తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న 30,200 మంది విద్యార్థులు, ప్రతి మండలం నుంచి 200 మంది చొప్పున 4,800 మంది సాధారణ ప్రజలు, అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి పారిశ్రామిక ప్రాంతాల్లోని ఫార్మా కర్మాగారాల్లో పనిచేస్తున్న 25,000 మంది ఉద్యోగులు, కార్మికులు యోగాంధ్ర వేడుకకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా వర్గాల వారికి వేర్వేరుగా బస్సులు కేటాయించారు. మొత్తం 825 ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తున్నారు. ప్రతి బస్సులో 40 నుంచి 50 మంది వెళ్లడానికి వీలుంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 200 ఆర్టీసీ బస్సులను గురువారం సాయంత్రానికే జిల్లాకు రప్పించారు. ఫార్మా కంపెనీల ఉద్యోగులు, కార్మికులు ఆయా కంపెనీలకు చెందిన బస్సుల్లో విశాఖ వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ నియోజకవర్గం బస్సులు, ఏ మార్గంలో విశాఖలోని యోగా వేదికల వద్దకు చేరుకోవాలో రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు. విద్యార్థులను తీసుకెళ్లే ప్రతి బస్సులో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా బాధ్యతలు అప్పగించారు. యోగాలో పాల్గొనే వారికి టీ షర్టులు, మ్యాట్‌లు అందించనున్నారు. యోగాకు వెళుతున్న ప్రతిఒక్కరి వివరాలను జియో ట్యాగింగ్ విధానంలో నమోదు చేస్తున్నారు.
రూట్లు.. మండలాలు..
రూట్ నంబర్-1: అనకాపల్లి, వి.మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, చోడవరం, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, రోలుగుంట, రావికమతం, సబ్బవరం మండలాలకు చెందిన బస్సులు చిన్నయ్యపాలెం జంక్షన్, సబ్బవరం, పెందుర్తి, గండిగుండం, శొంఠ్యాం అండర్ బ్రిడ్జి, అడవివరం, హనుమంతువాక, ఎండాడ లా కాలేజీ రోడ్డు, ఐటీ సెజ్ మార్గంలో బీచ్ రోడ్డుకు వెళ్లాల్సి ఉంటుంది.
రూట్ నంబర్-2: పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, ఎలమంచిలి, కశింకోట, మునగపాక, కోటవురట్ల, నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం మండలాలకు చెందిన బస్సులు ఆయా రూట్లలో జాతీయ రహదారిపై తాళ్లపాలెం, కశింకోట మీదుగా ప్రయాణించి అనకాపల్లి బైపాస్, సబ్బవరం, పెందుర్తి, గండిగుండం, శొంఠ్యాం అండర్ బ్రిడ్జి, అడవివరం, హనుమంతువాక జంక్షన్, ఎండాడ లా కళాశాల రోడ్డు, ఐటీ సెజ్ మీదుగా బీచ్ రోడ్డులో కేటాయించిన ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.
రూట్ నంబర్-3: రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లోని ఫార్మా కంపెనీలు, పరిశ్రమల కార్మికులు, ఉద్యోగులు, ఆయా మండలాలకు చెందిన విద్యార్థుల బస్సులు లంకెలపాలెం, గాజువాక, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, అడవివరం, హనుమంతువాక జంక్షన్, ఎండాడ లా కళాశాల రోడ్డు, ఐటీ సెజ్ మీదుగా బీచ్ రోడ్డులో కేటాయించిన ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.
జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు
ఎస్పీ తుహిన్ సిన్హా
విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం వైపు నుంచి పాయకరావుపేట మీదుగా విశాఖ వైపు వెళ్లే భారీ వాహనాలను శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి పాయకరావుపేట వద్ద నిలిపివేస్తారు. ఇతర వాహనాలు పాయకరావుపేట నుంచి అనకాపల్లి, సబ్బవరం, పెందుర్తి మీదుగా ఆనందపురం వైపు వెళ్లాల్సి వుంటుంది. అనకాపల్లి జిల్లా నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వెపు రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు శుక్ర, శనివారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఎస్పీ సూచించారు. జాతీయ రహదారిపై లారీలను, బ్రేక్ డౌన్ అయిన వాహనాలను నిలిపి ఉంచకూడదు. ట్రక్కులు, ట్రాలీలు, ఇతర భారీ వాహనాలను పోలీసులు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే రెండు రోజులపాటు పార్కింగ్ చేసుకోవాలి.