2047 నాటికి 50 శాతం పచ్చదనం
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:22 AM
వికసిత్ భారత్‌లో భాగంగా విశాఖ సర్కిల్‌లో పచ్చదనాన్ని 50 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అటవీ శాఖ కన్జర్వేటర్ బీఎం దివాన్ మైదీన్ చెప్పారు.
విశాఖ సర్కిల్‌లో నాలుగు నగర వనాలు
ఎకో టూరిజానికి ప్రోత్సాహం
పర్యాటక ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పిస్తాం
అటవీ శాఖ విశాఖ సర్కిల్ కన్జర్వేటర్ దివాన్ మైదీన్
విశాఖపట్నం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):
వికసిత్ భారత్‌లో భాగంగా విశాఖ సర్కిల్‌లో పచ్చదనాన్ని 50 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అటవీ శాఖ కన్జర్వేటర్ బీఎం దివాన్ మైదీన్ చెప్పారు. ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ విశాఖ సర్కిల్ మొత్తం విస్తీర్ణం 23,547 చ.కి.మీ. కాగా 6,574.18 చ.కిమీ.మేర అడవులు ఉన్నాయన్నారు. అడవులు కాకుండా బయట పచ్చదనం 1650 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉందన్నారు. మొత్తం 8,224.18 చ.కి.మీ (34.92 శాతం) పచ్చదనం ఉందన్నారు. దీనిని 2047కల్లా 11,700 చ.కి.మీ.కు పెంచనున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి భారీగా పచ్చదనం పెంపునకు నిర్ణయించామన్నారు.
ఉత్తరాంధ్రలో కొత్తగా ఎలమంచిలి, నర్సీపట్నం, పాతపట్నం, పాలకొండల్లో నగరవనాలు ఏర్పాటుచేయనున్నామని వెల్లడించారు. పాలకొండలో పది హెక్టార్లలో నగరవనం అభివృద్ధికి రూ.40 లక్షలు, మిగిలిన మూడుచోట్ల 50 హెక్టార్లలో వనాల అభివృద్ధికి రూ.1.5 కోట్లు వంతున ఖర్చు చేస్తామన్నారు. నగర వనాల్లో వాకింగ్, యోగా, ధ్యానం చేసుకునేందుకు సదుపాయాలు కల్పిస్తామన్నారు. అడవిలో ఉన్నామనే భావన వచ్చేలా ఏర్పాట్లుచేస్తామన్నారు. అలాగే ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అరకులోయ, అనంతగిరి, లంబసింగి, వంజంగి తదితర ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. వచ్చే నెల నుంచి సముద్రతీర ప్రాంతాలకు తాబేళ్ల రాక ప్రారంభమవుతుందని కన్జర్వేటర్ పేర్కొన్నారు. గత సీజన్‌లో మూడు లక్షల తాబేళ్ల గుడ్ల రక్షణకు కేంద్రాలు ఏర్పాటుచేశామని, వాటి నుంచి 80 శాతం పిల్లలు బయటకు రాగా సముద్రంలో విడిచిపెట్టామన్నారు. తాబేళ్ల రక్షణకు నెస్టింగ్ కేంద్రాల ఏర్పాటు, ప్రజలకు చైతన్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.