యోగాకు 5 లక్షల మంది సమీకరణ
ABN , Publish Date - Jun 07 , 2025 | 01:08 AM
నగరంలో ఈనెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఐదు లక్షల మంది పాల్గొనేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
విశాఖపట్నం జిల్లా నుంచి 3.5 లక్షలు, అనకాపల్లి నుంచి లక్ష, విజయనగరం నుంచి 30 వేలు, శ్రీకాకుళం నుంచి 20 వేల మంది...
ప్రతి ఒక్కరికి టీషర్టు, మ్యాట్
తరలింపునకు 8,000 బస్సులు
విశాఖపట్నం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ఈనెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఐదు లక్షల మంది పాల్గొనేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. విశాఖపట్నం జిల్లా నుంచి మూడున్నర లక్షల మందిని, అనకాపల్లి జిల్లా నుంచి 1.5 లక్షల మందిని, విజయనగరం నుంచి 30 వేలు, శ్రీకాకుళం జిల్లా నుంచి 20 వేల మందిని సమీకరించనున్నారు. ఐదు లక్షల మందికీ టీషర్టు (యోగా ప్రదర్శనతో కూడిన లేబుల్), మ్యాటు సరఫరా చేస్తారు. టీషర్టులు, మ్యాట్లు ఢిల్లీ నుంచి రెండు రోజుల్లో నగరానికి రానున్నాయి. వాటిని ఏయూ జిమ్నాజియం స్టేడియంలో భద్రపరచి, 15వ తేదీ తరువాత అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. యోగా ప్రదన్శనకు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు బీచ్‌రోడ్ పొడవునా 29 కంపార్టుమెంట్లు ఏర్పాటుచేస్తున్నారు. మరో నాలుగు ఇండోర్ స్టేడియాలు గుర్తించారు. నగరం, పొరుగు జిల్లాల నుంచి అభ్యాసకులు 21వ తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకల్లా బీచ్ రోడ్డులో కేటాయించిన కంపార్టుమెంట్లకు చేరుకోవాలి. ఇందుకు ఆరు వేల ఆర్టీసీ బస్సులు, మరో రెండు వేల ప్రైవేటు బస్సులు, పెద్ద సంఖ్యలో ఆటోలు, చిన్నపాటి వాహనాలు ఏర్పాటుచేస్తున్నారు. వాటి కోసం బీచ్ పొడవునా 51 పార్కింగ్ కేంద్రాలు గుర్తించారు. నగరంలో జన నమీకరణ బాధ్యతలు అన్ని ప్రభుత్వ శాఖలు, జీవీఎంసీ యూసీడీ, పాఠశాల విద్యా శాఖ, ఇంటర్ బోర్డు, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలు, వర్సిటీ అధికారులకు అప్పగించారు. 21వ తేదీ ఉదయం 7.15 గంటలకు ప్రారంభం కానున్న ప్రదర్శన 8.15 గంటలకు ముగుస్తుంది.
విశాఖ కేంద్రంగా ఎకనామిక్ రీజియన్
అనకాపల్లి, అల్లూరి సహా ఎనిమిది జిల్లాలతో ఏర్పాటు
పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం సుమారు లక్ష ఎకరాలు సమకూర్చనున్న ప్రభుత్వం
విశాఖ-కాకినాడ మధ్య బీచ్ రోడ్
2028-30 నాటికి విశాఖ మెట్రో ప్రాజెక్టు
విశాఖపట్నం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మించనున్నట్టే...ఇటు వైపు కాకినాడ వరకూ బీచ్ రోడ్డును నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు ఆదేశించారు. దీనిని జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని సూచించారు. అమరావతిలో శుక్రవారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో విశాఖ కేంద్రంగా ఎనిమిది జిల్లాలతో ఏర్పాటుచేయబోయే ‘ఎకనామిక్ రీజియన్’పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఏయే జిల్లాలంటే...?
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలను ఎకనామిక్ రీజియన్‌గా ఏర్పాటు చేస్తారు. ఈ జిల్లాలో ఆర్థిక వ్యవహారాలు పెరిగేలా...తద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెంది, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటారు. ఈ రీజియన్‌లో వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం సుమారు లక్ష ఎకరాలను సమకూరుస్తారు. ఐటీ రంగంలో లక్షల మందికి ఉపాధి కల్పించేలా స్టార్టప్‌లు, డేటా సెంటర్లు, ఇన్నోవేషన్ కేంద్రాలు నెలకొల్పుతారు. పోర్టులు, ఐటీ, పర్యాటకం, హెల్త్ కేర్, వ్యవసాయం, పట్టణీకరణ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆయా రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 2028-30 నాటికి విశాఖపట్నంలో 77 కి.మీ. పొడవున మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
డీఎస్సీ రాత పరీక్షలు ప్రారంభం
తొలి రోజు ఏడు కేంద్రాల్లో నిర్వహణ
88.39 శాతం హాజరు
విశాఖపట్నం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):
డీఎస్సీ రాత పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో తొలిరోజు ఏడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,447 మంది అభ్యర్థులకుగాను 2,163 మంది (88.39 శాతం) పరీక్షకు హాజరయ్యారు. నాన్ లాంగ్వేజ్ కేటగిరీలో గణితం, ఫిజికల్ సైన్స్ (ఆంగ్ల మాధ్యమం), లాంగ్వేజ్ కేటగిరీలో తెలుగు, హిందీ సబ్జెక్టులకు రాత పరీక్ష నిర్వహించారు. ఉదయంపూట పరీక్షకు 1,435 మందికిగాను 1,278 మంది, మధ్యాహ్నం 1,012 మందికిగాను 885 మంది హాజరయ్యారు. అభ్యర్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. డీఈవో ప్రేమ్‌కుమార్ ఒక కేంద్రాన్ని తనిఖీ చేశారు.