గిరిజన నిరుద్యోగుల 48 గంటల ధర్నా
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:18 PM
ప్రత్యేక డీఎస్‌సీ సాధన సమితి కన్వీనర్ ఎస్.ధర్మన్నపడాల్ ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరుద్యోగుల 48 గంటల ధర్నాను సోమవారం ప్రారంభించారు.
ఐటీడీఏ కార్యాలయం ఎదుట ప్రారంభం
ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్ అమలు చేయాలి
గిరిజన సంఘం జాతీయ సభ్యుడు అప్పలనర్స డిమాండ్
పాడేరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక డీఎస్‌సీ సాధన సమితి కన్వీనర్ ఎస్.ధర్మన్నపడాల్ ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరుద్యోగుల 48 గంటల ధర్నాను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జాతీయ సభ్యుడు పి.అప్పలనర్స మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో గిరిజనులకు శతశాతం రిజర్వేషన్ కల్పించాలని, మెగా డీఎస్‌సీలో షెడ్యూల్డ్ ప్రాంత పోస్టులను మినహాయించాలని డిమాండ్ చేశారు. జీవో:3 రద్దుతో గిరిజనులకు అన్యాయం జరిగిందని, ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే జీవో:3 తరహాలోనే ఉద్యోగాలు కల్పించే జీవో ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. ఆయన హామీ ఇచ్చిన మేరకు ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్ కల్పించాలని, మెగా డీఎస్‌సీలో గిరిజన ప్రాంత టీచర్ పోస్టులను మినహాయించి ఎస్‌టీలకు స్పెషల్ డీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. జీవో:3 సమస్యపై గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పును కూటమి ప్రభుత్వం చేయకూడదని, కచ్చితంగా గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. రాజ్యాంగం ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతాల్లోని ప్రత్యేక పరిస్థితులు, అవసరాల రీత్యా ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా ఏళ్లుగా ప్రత్యేక డీఎస్‌సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఆదివాసీలకు మెగా డీఎస్‌సీలో అన్యాయం జరకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ ఎస్.సత్యనారాయణ, ప్రత్యేక డీఎస్‌సీ సాధన సమితి కో-కన్వీనర్లు కె.రాధాకృష్ణ, భానురావు, డీఎల్‌వో నేత కొత్తయ్య, ఎస్‌ఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు కార్తిక్, ఐద్వా నేత హైమావతి, అధిక సంఖ్యలో డీఎస్‌సీ అభ్యర్థులు పాల్గొన్నారు.