45 కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:30 PM
మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ సమీపంలో శనివారం ఉదయం బైక్‌లపై తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ జె.రామకృష్ణ అందించిన వివరాలిలా ఉన్నాయి.
రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం
ముంచంగిపుట్టు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లబ్బూరు సమీపంలో శనివారం వాహన తనిఖీలు చేస్తుండగా.. ఒడిశా వైపు నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో చాకచక్యంగా వ్యవహరించి నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు బస్తాలను తనిఖీ చేయగా.. అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించామని ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఆ గంజాయిని రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమక్షంలో తూనిక వేయగా.. 45 కిలోలు ఉంది. పట్టుబడిన గంజాయి స్మగ్లర్లు ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పంపర్లమెట్ట పంచాయతీ సువడోలింబా గ్రామానికి చెందిన కంటెరి జలంధర్, దామా హంతల్, చింతలారి గ్రామానికి చెందిన పట్టి ఖారా, కొరాపుట్టు జిల్లా గంజైపాదర్ గ్రామానికి చెందిన గెన్ను హంతల్‌గా విచారణలో నిర్థారణ అయిందన్నారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ నలుగురుని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ జె.రామకృష్ణ తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఎస్‌ఐ లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.