పీ-4కు 4,000 మంది మార్గదర్శకులు గుర్తింపు
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:26 AM
జిల్లాలో పీ-4 పథకం కోసం ఇప్పటివరకూ నాలుగు వేల మంది మార్గదర్శకులను గుర్తించామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు.
38,000 బంగారు కుటుంబాలతో మ్యాపింగ్
నగరంలో ఐటీ పార్కు అభివృద్ధికి రహేజా గ్రూపు ఆసక్తి
త్వరలో 2,000 మందితో కాగ్నిజెంట్ ప్రారంభం
సొంత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యేంత వరకూ అద్దె భవనంలో కార్యకలాపాలు
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పీ-4 పథకం కోసం ఇప్పటివరకూ నాలుగు వేల మంది మార్గదర్శకులను గుర్తించామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. గురువారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలుత 73 వేల బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. తరువాత సర్వే చేస్తే వారిలో సుమారు 10 వేల మంది అన్హరులు ఉన్నారని తేలిందన్నారు. మిగిలిన 63 వేల మందితో మార్గదర్శకులను అనుసంధానం చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతుందన్నారు. ఇప్పటివరకూ గుర్తించిన నాలుగు వేల మంది మార్గదర్శకులను 38 వేల మంది బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేశామన్నారు. పెద్ద కంపెనీలకు ఎక్కువ స్థాయిలో బంగారు కుటుంబాలతో మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 607 సచివాలయాల పరిధిలో కనీసం 10 మంది చొప్పున మార్గదర్శకులను గుర్తించే పని చురుగ్గా సాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈనెల 19వ తేదీన పీ-4 ప్రారంభం కానున్నదని, ఆలోగా మరింత మంది మార్గదర్శకులను గుర్తిస్తామన్నారు.
నగరంలో ఇన్ ఆర్బిట్ మాల్ నిర్మిస్తున్న రహేజా గ్రూపు ఐటీ పార్కు అభివృద్ధికి పలుచోట్ల స్థలాలను పరిశీలించిందన్నారు. రుషికొండ ఐటీ హిల్స్ వద్ద 20 ఎకరాలు చూసిందన్నారు. కాగా, కాగ్నిజెంట్‌కు మధురవాడలో హరిత ప్రాజెక్టు పక్కన 22 ఎకరాలు, ఐటీ పార్కు అభివృద్ధి కోసం సిఫీ కంపెనీకి పరదేశిపాలెంలో 25 ఎకరాలు గుర్తించామన్నారు. ఇప్పటివరకూ ఐటీ కంపెనీలకు 100 ఎకరాలు కేటాయించామని వివరించారు. కాగ్నిజెంట్ సొంత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యేసరికి కొంత సమయం పడుతుందని, అప్పటివరకూ నగరం నుంచి కార్యకలాపాలు చేపట్టాలని యోచిస్తోందన్నారు. త్వరలో సుమారు రెండు వేల మందితో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అద్దెకు భవనాలను అన్వేషిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు.
మూడు కుటుంబాలను దత్తత తీసుకున్న కలెక్టర్
జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ జిల్లాలో మూడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఆరిలోవలో ఆటోడ్రైవర్, దొండపర్తిలో భర్త లేని మహిళ కుటుంబం, ఆనందపురంలో తల్లిలేని ఇద్దరు పిల్లలను కలెక్టర్ దత్తత తీసుకున్నారు. ఆరిలోవ వాసికి సొంతంగా ఆటో లేకపోవడంతో అద్దె ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డిగ్రీ పాసైన పెద్దకుమార్తెకు ఉద్యోగం, పదో తరగతితో చదువు ఆపేసిన చిన్న కుమార్తెకు టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే దొండపర్తిలో భర్త లేని మహిళకు ఒక కుమారుడు ఉన్నాడు. అతను డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తనకు పింఛన్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. ఆనందపురంలో ఇద్దరు పిల్లలు ప్రస్తుతం తాతగారింటి వద్ద పెరుగుతున్నారు. మతిస్థిమితం కోల్పోయిన తల్లి ఆచూకీ లేదు. తండ్రి కూలి పనులు చేస్తున్నా మద్యానికి బానిస కావడంతో ఆరు, నాలుగు తరగతులు చదువుతున్న పిల్లల జీవనం, చదువుకు ఇబ్బంది ఉంది. ఇద్దరు పిల్లలకు హాస్టళ్లలో సీట్లు ఇప్పిస్తే చదువుకుంటామని వారు కోరారు. దత్తత తీసుకున్న మూడు కుటుంబాలను రెండు రోజుల క్రితం ఛాంబర్‌కు పిలిపించుకుని కలెక్టర్ మాట్లాడి పలు వివరాలు సేకరించారు. అన్నివిధాలా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.