Share News

డొంకరాయి నుంచి 4 వేల క్యూసెక్కులు విడుదల

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:09 PM

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని శుక్రవారం నుంచి విడుదల చేస్తున్నారు.

డొంకరాయి నుంచి 4 వేల క్యూసెక్కులు విడుదల
డొంకరాయి జలాశయం నుంచి దిగువకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్నున్న దృశ్యం

జలాశయానికి ఇన్‌ఫ్లో 8 వేల క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం 1036.60 అడుగులు

పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రానికి మరో నాలుగు వేల క్యూసెక్కులు

సీలేరు/మోతుగూడెం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని శుక్రవారం నుంచి విడుదల చేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి ఇన్‌ఫ్లో ఎనిమిది క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా, ప్రస్తుతం 1036.60 అడుగులకు చేరుకుంది. దీంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమై గురువారం రాత్రి ఒక గేటు ద్వారా 2 వేలు క్యూసెక్కులు విడుదల చేశారు. అయితే భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో శుక్రవారం ఉదయం నుంచి జలాశయం ఆరు, ఏడు గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని జెన్‌కో అధికారులు తెలిపారు. అలాగే పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రానికి విద్యుదుత్పత్తి కోసం మరో నాలుగు వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం డొంకరాయి జలాశయానికి 8 వేల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వస్తున్నదన్నారు. ఇన్‌ఫ్లో తగ్గేంతవరకు నీటి విడుదలను కొనసాగిస్తామని ఏపీ జెన్‌కో ఏఈఈ శివశంకర్‌ తెలిపారు.

Updated Date - Oct 24 , 2025 | 11:09 PM