విశాఖ-భోగాపురం మధ్య 4 థీమ్ టౌన్‌షిప్‌లు
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:38 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కొత్తగా ప్రత్యేక థీమ్‌తో టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
భీమిలి సమీపాన కొత్తవలస, ఆనందపురం మండలం శొంఠ్యాం ప్రాంతాల ఎంపిక
ప్రాథమికంగా ఐటీ అండ్ ఇన్నోవేషన్, హెల్త్ అండ్ వెల్‌నెస్, నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్, టూరిజం అండ్ కల్చర్, లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్ వంటి రంగాలు గుర్తింపు
నివాసాలు, రిసార్ట్స్, గోల్ఫ్ కోర్సులు ఏర్పాటు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కొత్తగా ప్రత్యేక థీమ్‌తో టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఫ్లోరిడా మోడల్‌లో తూర్పు తీరాన విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వ సూచన మేరకు కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. విశాఖ నుంచి భోగాపురం మధ్య నాలుగు ప్రాంతాల్లో ఈ థీమ్ టౌన్‌షిప్‌లు ఏర్పాటుచేస్తారు. అందులో ఒకటి భీమిలి మండలం కొత్తవలస వద్ద మరొకటి ఆనందపురం మండలంలోని శొంఠ్యాం ప్రాంతంలో రానున్నాయి. మరో రెండు ప్రాంతాలను గుర్తించాల్సి ఉంది.
వివిధ రంగాల అభివృద్ధే ధ్యేయంగా
విశాఖను ‘బే సిటీ మియామీ’గా అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రతి టౌన్‌షిప్‌కు ప్రత్యేకమైన థీమ్ ఉంటుంది. ఐటీ అండ్ ఇన్నోవేషన్, హెల్త్ అండ్ వెల్‌నెస్, నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్, టూరిజం అండ్ కల్చర్, లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్, ఎకో రీసైలెన్స్ వంటి రంగాలను ప్రాథమికంగా గుర్తించారు. ఒక్కో టౌన్‌షిప్ ఒక్కో రంగానికి ప్రత్యేకించి అభివృద్ధి చేస్తారు. మాస్టర్ ప్లాన్ రూపొందించి లేఅవుట్లు వేయడమే కాకుండా ఆయా పరిశ్రమలు రావడానికి, పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైన మౌలిక వసతులు సమకూరుస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాల కేంద్రాలుగా వాటిని తయారుచేస్తారు. ఇక్కడ సముద్రతీరం, పర్యాటక అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉండడంతో గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీని ఓ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో వీటిని ప్లాన్ చేశారు. వీటిలో భాగంగా రెసిడెన్షియల్ కాలనీలు, కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్స్, థీమ్ పార్కులు, గోల్ఫ్ కోర్సులు వంటి వస్తాయి. ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపడతారు.
5 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా
ఈ నాలుగు థీమ్ బేస్ట్ టౌన్‌షిప్‌ల ద్వారా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్‌లు తెలిపారు. ఈ ప్రాజెక్టులను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపడతామని, వీటికి డిజైన్లు తయారు చేయడానికి ఆర్కిటెక్ట్‌లను ఆహ్వానిస్తూ ప్రకటన కూడా జారీ చేశామన్నారు.