జి.మాడుగులలో 4 డిగ్రీలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:42 AM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగడంతో చలి తీవ్రత తగ్గలేదు. జి.మాడుగులలో బుధవారం 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
కొనసాగుతున్న చలి తీవ్రత
పాడేరు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగడంతో చలి తీవ్రత తగ్గలేదు. జి.మాడుగులలో బుధవారం 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా కేంద్రం పాడేరుతో సహా అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా అలముకుంది. చలి తీవ్రతకు జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతున్నారు. అలాగే మన్యంలో హుకుంపేట, కొయ్యూరు మినహా మిగతా మండలాల్లో సింగిల్ డిజిట్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి.మాడుగులలో బుధవారం 4.0, ముంచంగిపుట్టులో 6.7, అరకులోయలో 8.6, పెదబయలులో 9.0, చింతపల్లిలో 9.3, పాడేరులో 9.9, హుకుంపేటలో 10.6, కొయ్యూరులో 12.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో చలి బెంబేలెత్తిస్తోంది. ఉదయం పది గంటలు దాటినా మంచు తెరలు వీడడం లేదు. సాయంత్రం నాలుగు దాటితే చాలు చలి గాలులు మొదలవుతున్నాయి. బుధవారం మండల కేంద్రంతో పాటు పలు చోట్ల ఉదయం మంచు దట్టంగా కమ్ముకుంది. సాయంత్రం ఆరు గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఎవరూ సాహసించడం లేదు. మండల కేంద్రంతో పాటు జోలాపుట్టు, బూసిపుట్టు, బంగారుమెట్ట, లక్ష్మీపురం ప్రాంతాల్లో జరిగే వారపు సంతల్లో ఉన్ని దుస్తులకు మంచి గిరాకీ లభిస్తుంది.
హుకుంపేటలో...
హుకుంపేట: మండలంలో బుధవారం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారిపై దట్టంగా మంచు పరుచుకోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు అవస్థలు పడ్డారు.