Share News

డుంబ్రిగుడలో 3.8 డిగ్రీలు

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:20 PM

మన్యంలో గురువారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగానే పొగమంచు కురిసింది.

డుంబ్రిగుడలో 3.8 డిగ్రీలు
పాడేరు- విశాఖపట్నం మెయిన్‌రోడ్డులో గురువారం ఉదయం పొగమంచు

తగ్గుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ఉదయం 9 గంటల వరకు దట్టంగా పొగమంచు

వణికిపోతున్న మన్యం వాసులు

పాడేరు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): మన్యంలో గురువారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగానే పొగమంచు కురిసింది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తుండగా, జనం చలి నుంచి ఉపశమనం పొందేందుకు యాతన పడుతున్నారు. తాజా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో అరకులోయ, వంజంగి, తాజంగి సందర్శనకు వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నది.

కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

వాతావరణంలో మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. కొయ్యూరు మినహా మిగతా ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌లోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డుంబ్రిగుడలో గురువారం 3.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జి.మాడుగులలో 4.2, హుకుంపేటలో 6.9, ముంచంగిపుట్టు, పాడేరులో 6.9, పెదబయలు, చింతపల్లిలో 7.1, కొయ్యూరులో 11.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

సీలేరులో..

సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో గురువారం పొగమంచు దట్టంగా అలుముకుంది. ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు తెరలు వీడలేదు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో జనం ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. పర్యాటకులు మాత్రం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.

ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో గురువారం ఉదయం 9 గంటలు దాటినా మంచు తెరలు వీడలేదు. గత కొద్ది రోజులుగా సింగిల్‌ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రంగా ఉండడంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు.

Updated Date - Dec 18 , 2025 | 11:20 PM