Share News

పీఎంఏవై 2.0లో 3,400 ఇళ్లు

ABN , Publish Date - Oct 25 , 2025 | 01:20 AM

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) 2.0లో భాగంగా జిల్లాకు 3,400 ఇళ్లు మంజూరయ్యాయని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ సీహెచ్‌ సత్తిబాబు తెలిపారు.

పీఎంఏవై 2.0లో 3,400 ఇళ్లు

సొంత స్థలం ఉన్నవారికి మాత్రమే మంజూరు

యూనిట్‌ వ్యయం రూ.2.5 లక్షలు

ఎన్టీఆర్‌ కాలనీల్లో పూర్తయిన 25 వేల ఇళ్లు

త్వరలో లబ్ధిదారులకు అప్పగింత

మిగిలిన నిర్మాణాలు వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి

రూ.631 కోట్లతో తాగునీటి వసతి

‘ఆంధ్రజ్యోతి’తో గృహ నిర్మాణ సంస్థ

జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ సీహెచ్‌ సత్తిబాబు

విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) 2.0లో భాగంగా జిల్లాకు 3,400 ఇళ్లు మంజూరయ్యాయని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ సీహెచ్‌ సత్తిబాబు తెలిపారు. పీఎంఏవై 2.0 కింద ఒక ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు రూ.2.5 లక్షలు ఇస్తారన్నారు. ఆయన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ పీఎంఏవై 2.0 కింద సొంత స్థలాలున్న వారికే ఇళ్లు కేటాయిస్తామన్నారు. పీజీఆర్‌ఎస్‌తోపాటు సచివాలయాలకు అందిన దరఖాస్తులను పరిశీలించి సొంత స్థలం ఉండి, ఇళ్లు లేని వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నామన్నారు. వారందరికీ సంబంధిత ఎమ్మెల్యేల సమక్షంలో అలాట్‌మెంట్‌ లేఖలు అందజేస్తామని వివరించారు. లబ్ధిదారులే స్వయంగా ఇళ్లు నిర్మించుకోవల్సి ఉంటుందని, దశల వారీగా బిల్లులు ఇస్తామని సత్తిబాబు తెలిపారు.

నగర శివారుల్లో మొత్తం 65 లేఅవుట్‌లలో సెంటు స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్లలో సుమారు 25 వేల ఇళ్లు త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. శ్రావణమాసంలో ఇళ్లు అప్పగించాలని భావించినా వర్షాలు కొనసాగడంతో తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. ఇంకా మిగిలిన 75 వేల ఇళ్లు వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తిచేస్తామన్నారు. ఇందుకుగాను కాంట్రాక్టర్లకు లక్ష్యాలు నిర్దేశించామని పేర్కొంటూ వర్షాలు తగ్గిన వెంటనే పనులు వేగవంతం చేయాలని ఆదేశించామన్నారు. ప్రతి ఇంటికీ తలుపులు బిగించిన తరువాతే లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. ఇప్పటికే కొందరు కాంట్రాక్టర్లు ఇళ్లకు తలుపులు బిగించారని, మిగిలిన కాంట్రాక్టర్లు ఈ విధానాన్ని కొనసాగించాల్సిందేనని స్పష్టంచేశారు.

కాలనీల్లో నివాసం ఉండే లబ్ధిదారులకు తాగునీటి కల్పన కోసం రూ.631 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపామని పీడీ సత్తిబాబు తెలిపారు. జీవీఎంసీ పరిధిలో నడుపూరు, దువ్వాడ, అగనంపూడి, దేశపాత్రునిపాలెం, ముదపాక, జెర్రిపోతులపాలెం తదితర లేఅవుట్‌లకు నీటి సరఫరా కోసం రూ.139.32 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మిగిలిన కాలనీలకు జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా రూ.472.7 కోట్లు అవసరమని ప్రతిపాదనల్లో పేర్కొన్నామన్నారు. అనకాపల్లి, గాజువాక, పెందుర్తి, విశాఖ పశ్చిమ నియోజకవర్గాల్లో ఉన్న కాలనీలకు పోలవరం కాలువ నుంచి, భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ఇళ్లకు గోస్తనీ నది నుంచి నీటి సరఫరా జరుగుతుందన్నారు. విద్యుత్‌ సరఫరా కోసం ఈపీడీసీఎల్‌ అధికారులు కాలనీల వారీగా సర్వేలు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారన్నారు. రోడ్లు, డ్రైన్ల కోసం ప్రతిపాదనలు రూపొందించాలని నిర్ణయించామన్నారు. కాలనీల్లో తక్కువ ఖర్చుతో మ్యాజిక్‌ డ్రైన్లు నిర్మించేలా గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రతిపాదిస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అగనంపూడి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో బినామీలపై సర్వే పూర్తిచేశామన్నారు. బినామీలు ఉన్న ఇళ్లకు నోటీసులు ఇచ్చామని, ఖాళీగా ఉన్న ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని సత్తిబాబు పేర్కొన్నారు.


జేఎన్‌ఆర్‌కు హౌసింగ్‌ చెక్‌

కంపెనీకి బిల్లుల చెల్లింపు నిలిపివేత

వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఇళ్ల నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న సంస్థ

అవకతవకలకు పాల్పడినట్టు ఇటీవల నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఫిర్యాదు

నిర్మాణ నాణ్యత పరిశీలించాలని జిల్లాలకు ఉన్నతాధికారుల ఆదేశం

మిగిలిన కంపెనీల బిల్లులు అప్‌లోడ్‌

విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):

నగర శివారు ప్రాంతాల్లోని పలు లేఅవుట్‌లలో జేఎన్‌ఆర్‌ కంపెనీ చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని గృహ నిర్మాణ సంస్థ నిర్ణయించింది. ఆ కంపెనీ నెల్లూరు జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలకు పాల్పడిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణలు చేయడంతో విచారణ చేపట్టాలని, అప్పటివరకూ బిల్లులు నిలిపివేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు పంపారు. దీంతో మిగిలిన నిర్మాణ సంస్థల బిల్లులు కూడా రెండు నెలలుగా ఆపేశారు. అయితే ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలంటే బిల్లులు ఇవ్వాలని ఆయా సంస్థలు కోరడంతో హౌసింగ్‌ ఉన్నతాధికారులు ఒక యాప్‌ రూపొందించారు. క్షేత్రస్థాయిలో ఇళ్ల తాజా ఫొటో తీసి ఆ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. జేఎన్‌ఆర్‌ కంపెనీ కాకుండా ఇతర నిర్మాణ సంస్థలు నిర్మించే ఇళ్ల నాణ్యత పరిశీలించిన అనంతరం బిల్లులు అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం ఇస్తారు.

ప్రధానంగా మూడో ఆప్షన్‌ కింద లబ్ధిదారుల తరపున కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న ఇళ్ల నాణ్యత పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 65 లేఅవుట్‌లలో పలు దశల్లో నిర్మిస్తున్న ఇళ్ల నాణ్యతను పరిశీలించే పనిలో అధికారులు ఉన్నారు. జిల్లాలో మొత్తం లక్ష ఇళ్లలో సుమారు 35 వేలు జేఎన్‌ఆర్‌ కంపెనీయే నిర్మిస్తోంది. వైసీపీ నేతకు చెందిన కంపెనీ కావడంతో జగన్‌ ప్రభుత్వంలో అనేక జిల్లాల్లో వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణ బాధ్యతలు దక్కించుకుంది. విశాఖ జిల్లాలో పెద్ద లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న జేఎన్‌ఆర్‌ కంపెనీకి హౌసింగ్‌లో కొందరు అధికారులు వత్తాసు పలుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు, ముగ్గురు ఏఈలు కూడా ఈ కంపెనీకి అనుకూలంగా ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యే ఆరోపణల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ఆ కంపెనీకి చెందిన ఇళ్ల నిర్మాణంపై విచారణ పూర్తయిన తరువాతే బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా జిల్లాలో ఇతర నిర్మాణ సంస్థలు నిర్మించిన సుమారు 5,500 ఇళ్లకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్‌కు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. గురువారం వరకూ 4,100 ఇళ్ల నాణ్యతను పరిశీలించి వాటి ఫొటోలు, దశల వారీగా చెల్లించే బిల్లుల వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ ఇళ్లకు సుమారు రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ తనిఖీ చేసిన ఇళ్లలో ఒకటి, రెండు శాతం మినహా మిగిలిన ఇళ్ల నాణ్యత బాగానే ఉందని హౌసింగ్‌ పీడీ సీహెచ్‌ సత్తిబాబు పేర్కొన్నారు. పైడివాడ అగ్రహారంతోపాటు పలుచోట్ల ఇళ్లకు తలుపులు బిగించలేదని గుర్తించామన్నారు. లబ్ధిదారులకు ఇళ్లు అందజేసే సమయంలో తలుపులు బిగించి ఇవ్వాలని నిర్మాణ సంస్థలకు స్పష్టం చేశామన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 01:25 AM