పెట్టుబడుల సదస్సుకు 3,000 మంది...
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:26 AM
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా నవంబరు 14, 15 తేదీల్లో నగరం వేదికగా జరగనున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం అయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు.
దేశ, విదేశాల నుంచి రాక
ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌ల వద్ద హెల్ప్ డెస్క్‌లు
అతిథులకు సంప్రదాయ కళాకారులతో స్వాగతం
ఏయూ మైదానంలో హెలిప్యాడ్లు
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
విస్తృత ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు
విశాఖపట్నం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా నవంబరు 14, 15 తేదీల్లో నగరం వేదికగా జరగనున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం అయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సన్నాహాక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదస్సుకు దేశ, విదేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు, ఇంకా రాయబారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నారన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న వేదిక వద్ద చేయాల్సిన పనులపై అధికారులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌ల వద్ద హెల్ప్ డెస్క్‌లు పెట్టి అతిథులకు సంప్రదాయ కళాకారులతో స్వాగతం పలకాలన్నారు. నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రోడ్లకు ఇరువైపులా పచ్చని మొక్కలు నాటాలన్నారు. రోడ్ల మరమ్మతులు పూర్తిచేయాలని, కార్యక్రమాల నిర్వహణ షెడ్యూల్ ఇతర వివరాలతో కూడిన హోర్డింగ్‌లు పెట్టాలని, అతిథులకు కాఫీ విత్ టేబుల్ బుక్స్, పర్యాటక ప్రాంతాల మాన్యువల్ పుస్తకాలు అందజేయాలన్నారు.
ప్రధాన వేదిక వద్ద మొక్కలతో అలంకరించాలన్నారు. ప్రతినిధుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా సాంకేతికతను వినియోగించుకోవాలని, డెలిగేట్స్‌కు కిట్లు, పాస్‌లు జారీ, ప్రధాన సదస్సు, అనుబంధ సదస్సు, బ్రేక్ అవుట్ సెషన్ల నిర్వహణ విషయంలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఏయూ మైదానంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి నేరుగా ల్యాండ్ అయ్యేలా హెలిప్యాడ్‌లు సిద్ధం చేయాలన్నారు. మంత్రులు, ఇతర ప్రముఖుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్, వసతి జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజులపాటు ప్రధాన వేదిక వద్ద ఉంటారని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నిరంతరం విద్యుత్ ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు రోజుల సదస్సుకు వచ్చే అతిథులు పర్యాటక ప్రాంతాలు, ఆలయాల సందర్శనకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు ముందుగా చేపట్టాలన్నారు. కార్యక్రమాలకు జేసీ మయూర్ అశోక్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఉంటుందని పేర్కొంటూ అక్కడ నుంచి సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. సమావేశంలో జేసీ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.