Share News

3 వేల ఎలక్ర్టిక్‌ బస్సులు

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:18 AM

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ)లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని, ముఖ్యంగా ఏడాది కాలంలో 1,400 కొత్త బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు.

3 వేల ఎలక్ర్టిక్‌ బస్సులు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు, తదితరులు వున్నారు.

రెండేళ్లలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తాం

రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి

ఎలమంచిలి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ)లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని, ముఖ్యంగా ఏడాది కాలంలో 1,400 కొత్త బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.28 లక్షలతో నిర్మించిన డ్రైవర్ల విశ్రాంతి భవనాన్ని ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రానున్న రెండేళ్ల కాలంలో కొత్తగా మూడు వేల ఎలక్ర్టిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. పీ-4 విధానంలో అవసరమైన ప్రాంతాల్లో మోడల్‌ బస్టాండ్‌లు నిర్మించడానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎలమంచిలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నదని, అందువల్ల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంతోపాటు దూరప్రాంత ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఎలమంచిలి మీదుగా రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఎలమంచిలికి ఆర్టీసీ డిపో మంజూరు చేస్తే.. ఇందుకు అవసరమైన స్థలాన్ని సమకూరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దూలి రంగనాయకులు, ఆర్టీసీ విజయనగరం జోన్‌ ఈడీ బ్రహ్మనందరెడ్డి, ఈఈ కె.అరుణకుమార్‌, డీపీటీవో ప్రవీణ, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజరు కె.పద్మావతి, కూటమి నాయకులు బొద్దపు శ్రీను, గొర్లె నానాజీ, కొలుకులూరి విజయ్‌బాబు, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, రాజాన శేషు, కరణం రవి, బొద్దపు రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 12:18 AM