Share News

జిల్లాలో 3 లక్షల స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:47 PM

జిల్లాలో మూడు లక్షల క్యూఆర్‌ కోడ్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.

జిల్లాలో 3 లక్షల స్మార్ట్‌ రేషన్‌ కార్డులు
స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి

రేషన్‌ డిపోల్లో నిత్యావసర సరకుల విక్రయానికి చర్యలు

సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేసిన

ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే

రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సంధ్యారాణి

అరకులోయ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు లక్షల క్యూఆర్‌ కోడ్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. శనివారం అరకులోయ తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూరదృష్టితో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. అవకతవకలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు చేకూర్చే విధంగా ఈ కార్డులు ఉపయోగపడతాయన్నారు. రేషన్‌ డిపోలలో అన్ని రకాల నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాలను సూపర్‌ హిట్‌ చేసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినప్పటికీ సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేసిందన్నారు. పింఛన్ల పెంపు, ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కుతుందన్నారు. గిరి శిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ రూ. వెయ్యికోట్లు మంజూరు చేశారన్నారు. ఈ పనులన్నీ ఒక్కొక్కటి కార్యరూపం దాలుస్తున్నాయన్నారు. రాష్ట్రమంతా కూటమి ప్రభుత్వానికి పట్టం కడితే అరకు,పాడేరు నియోజకవర్గాల్లో అందుకు విరుద్ధంగా ఫలితాలు రావడం బాధగా ఉందని మంత్రి సంధ్యారాణి అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గిరిజనులంతా కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. అందుకు మహిళలు ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. ఏదైన సమస్యఉంటే జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, సబ్‌కలెక్టర్‌ కాకుండా టీడీపీ అరకు, పాడేరులో నియోజకవర్గ ఇన్‌చార్జీలు, జీసీసీ చైర్మన్లను కలిస్తే పరిష్కారం లభిస్తుందన్నారు. ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేస్తే ఏ ప్రయోజనం ఉండదన్నారు. అనంతరం ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ మాట్లాడారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి పలువురు గిరిజనులు తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, బీజేపీ నాయకుడు పాంగి రాజారావు, జనసేన అరకు ఇన్‌చార్జి చిరంజీవి, వ్యవసాయ కమిటీ చైర్మన్‌ బొరొబొరి లక్ష్మి, పెదలబుడు సర్పంచ్‌ దాసుబాబు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:47 PM