29 మంది విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:24 AM
జర్రెల గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
జర్రెల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
సకాలంలో వైద్యం అందడంతో తప్పిన ప్రాణాపాయం
తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలింపు
గూడెంకొత్తవీధి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జర్రెల గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థులను చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
జర్రెల గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో 210 మంది విద్యార్థులు మూడు నుంచి పదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు. బుధవారం రాత్రి విద్యార్థులకు మెనూ ప్రకారం దొండకాయ కూర పెట్టాలి. కానీ దొండకాయలు అందుబాటులో లేకపోవడంతో కూర పెండలం దుంపలు విద్యార్థులకు వండిపెట్టారు. అలాగే మధ్యాహ్నం పెట్టాల్సిన పెరుగు రాత్రి పెట్టారు. విద్యార్థులు కూర పెండలం, పెరుగు ఆహారంగా తీసుకున్నారు. రాత్రి స్టడీ ముగించుకుని విద్యార్థులు తొమ్మిది గంటలకు నిద్రించారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 19 మంది విద్యార్థుల్లో కడుపునొప్పి ప్రారంభమైంది. మరో పది మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.సింహాచలం చింతపల్లి ఏటీడబ్ల్యూవో బి.జయనాగలక్ష్మికి తెలియజేశారు. ఏటీడబ్ల్యూవో వెంటనే జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎస్‌వీఎస్ మణిదీప్‌కి సమాచారం ఇచ్చారు. ఉదయం ఆరున్నర గంటలకే ఏటీడబ్ల్యూవో, వైద్యాధికారి, వైద్య సిబ్బంది పాఠశాలకు చేరుకున్నారు. వైద్యాధికారి, వైద్య సిబ్బంది ఆరున్నర గంటలకు అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు కొంత మంది, సాయంత్రానికి మొత్తం విద్యార్థులు కోలుకున్నారు. ముగ్గురు విద్యార్థుల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఏటీడబ్ల్యూవో అంబులెన్సులో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాత్రి వేళ విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే మెరుగైన చికత్స అందించేందుకు వైద్యాధికారి మణిదీప్, వైద్య సిబ్బంది వసతి గృహంలోనే బస చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి విలేకరులతో మాట్లాడుతూ కూర పెండలం దుంప రాత్రి వేళ తినడం వల్ల విద్యార్థుల్లో అజీర్తి సమస్య తలెత్తిందన్నారు. కూరపెండం దుంప రాత్రి వేళ తీసుకుంటే పెద్దవాళ్లలోనే అజీర్తి సమస్య వస్తుందని, అస్వస్థతకు గురైన విద్యార్థులందరూ కోలుకున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు.