Share News

యోగాంధ్రకు 26 వేల మంది గిరిజన విద్యార్థులు

ABN , Publish Date - Jun 16 , 2025 | 11:33 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి యోగాంధ్ర వేడుకల్లో ఏజెన్సీ నుంచి 26 వేల మంది గిరిజన విద్యార్థులు పాల్గొనేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

యోగాంధ్రకు 26 వేల మంది గిరిజన విద్యార్థులు
అరకులోయలో ఏప్రిల్‌ 7న విద్యార్థులు యోగాసనాలు వేస్తున్నప్పటి చిత్రం

500 బస్సుల్లో విశాఖ తరలింపునకు ఏర్పాట్లు

టీడబ్ల్యూ డీడీ రజనికి బాధ్యతల అప్పగింత

పాడేరు, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి యోగాంధ్ర వేడుకల్లో ఏజెన్సీ నుంచి 26 వేల మంది గిరిజన విద్యార్థులు పాల్గొనేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7న అరకులోయలో 21 వేల మంది గిరిజన విద్యార్థులు యోగాసనాలతో పాటు 108 మార్లు సూర్యనమస్కారాల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా విద్యార్థులందరూ ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యే విశాఖపట్నంలోని రాష్ట్రస్థాయి యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆయా బాధ్యతలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎల్‌.రజనికి అప్పగించారు. ఆమె ఏజెన్సీలోని పదకొండు మండలాలకు చెందిన ఏటీడబ్ల్యూవోలు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, వ్యాయామ సంచాలకులు, వ్యాయామ టీచర్లు, తదితరులను సమన్వయం చేస్తున్నారు. 26 వేల మంది గిరిజన విద్యార్థులను ఏజెన్సీ నుంచి విశాఖపట్నం తరలించేందుకు 500 బస్సులను ఏర్పాటు చేస్తుండగా, విద్యార్థుల యోగక్షేమాలను చూసుకునేందుకు 2,500 మంది సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ విద్యాశాఖాధికారులు, హెచ్‌ఎంలు, టీచర్లు, పీడీ, పీఈటీలు, తదితరులు యోగాంధ్ర వేడుకలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 11:33 PM