జిల్లాలో 26 బ్లాక్ స్పాట్స్
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:07 AM
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం మంగళవారం ఆమె అధ్యక్షతన కలెక్టర్‌లో నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు
15 రోజుల్లో నివేదిక అందజేయాలి
ఆయా ప్రదేశాల వద్ద హెచ్చరిక బోర్డులు ఉండాలి
నిబంధనలు అతిక్రమించే వాహనాలను ఉపేక్షించొద్దు
మైనింగ్ ప్రాంతాల్లో శాశ్వత తనిఖీ కేంద్రాలు
రహదారి భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి కలెక్టరేట్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం మంగళవారం ఆమె అధ్యక్షతన కలెక్టర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు (బ్లాక్ స్పాట్స్)గా గుర్తించిన 26 ప్రాంతాల్లో తక్షణమే నివారణ చర్యలు చేపట్టి, 15 రోజుల్లో నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు. బ్లాక్ స్పాట్స్‌కు 200 మీటర్ల ముందు నుంచి ప్రతి 50 మీటర్లకు ఒకటి చొప్పున హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు.
వ్యక్తిగత వాహనాలతోపాటు, రవాణా వాహనాలను నిత్యం పర్యవేక్షించాలని, పరిమితికి మించి సరుకు లేదా ఇతర వస్తువులు రవాణా చేసే వాహనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధిక వేగం, రాంగ్‌రూట్‌లో వాహనాలను నడపడం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. జిల్లాలో లంకెలపాలెం నుంచి పాయకరావుపేట వరకు జాతీయ రహదారి నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారికి ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని, వాహనాల పార్కింగ్, దుకాణాలు ఏర్పాటును నిరోధించాలని చెప్పారు. జాతీయ రహదారిపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో శాశ్వత తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఓవర్‌లోడు, అధిక వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు సూచించిన ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా ఎన్‌హెచ్‌ఏఐ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్‌గా కొత్తగా గుర్తించిన ప్రాంతాల్లో కమిటీ సభ్యులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించి, ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై నివేదిక అందించాలన్నారు. బొజ్జన్నకొండ వద్ద భారీ వాహనాలు యూటర్న్ తీసుకోకుండా నిరోధించాలని, వాహనాలు నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించేలా సిబ్బందిని నియమించి పర్యవేక్షణ చేయాలని రోడ్లు-భవనాలు, రవాణా శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో వై.సత్యనారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.