సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో 24 గంటల గస్తీ
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:27 PM
మండలంలోని పెదవలస అటవీశాఖ రేంజ్ పరిధిలో ఉన్న సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాల జరగకుండా మూడు బేస్ క్యాంప్‌లతో 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నట్టు స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి వైవీ నరసింహరావు అన్నారు.
మూడు బేస్ క్యాంప్‌లు ఏర్పాటు
కూలీలు, వ్యాపారులపై నిఘా
డీఎఫ్‌వో వైవీ నరసింహారావు
చింతపల్లి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదవలస అటవీశాఖ రేంజ్ పరిధిలో ఉన్న సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాల జరగకుండా మూడు బేస్ క్యాంప్‌లతో 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నట్టు స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి వైవీ నరసింహరావు అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సిగినాపల్లి రంగురాళ్ల క్వారీ వెయ్యి అడుగుల ఎత్తులో ఉందన్నారు. వర్షాలు కురిస్తే వ్యాపారుల ప్రోత్సాహంతో కొంతమంది కూలీలు క్వారీ వద్ద తవ్వకాలకు ప్రయత్నించేవారన్నారు. రెండు నెలలుగా సిగినాపల్లి రంగురాళ్ల క్వారీ ప్రాంతాన్ని అటవీశాఖ స్వాధీనం చేసుకున్నదన్నారు. క్వారీ వద్ద తవ్వకాలను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు శాశ్వత బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా తవ్వకాలు జరగకుండా అటవీశాఖ ఉద్యోగులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. తవ్వకాలతో కలిగే నష్టాలను ఉద్యోగులు క్వారీ పరిసర గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. గతంలో రంగురాళ్ల క్వారీ వద్ద తవ్వకాలకు పాల్పడిన వ్యాపారులపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు. మైదాన ప్రాంతాల వ్యాపారులకు నోటీసులు జారీ చేశామన్నారు. కూలీలు, వ్యాపారుల కదలికలపై నిఘా పెట్టామన్నారు. ఇప్పటికే కొంతమంది వ్యాపారులు, కూలీలపై జీకేవీధి పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టామన్నారు. క్వారీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. ప్రస్తుతం ఫారెస్టు రేంజ్ అధికారి, ఫారెస్టు సెక్షన్ అధికారి, బీట్ అధికారితో పాటు 20మంది బేస్ క్యాంప్, స్ట్రైకింగ్ ఫోర్సు సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. క్వారీ వద్దకు గిరిజనులుగాని, వ్యాపారులుగాని వెళ్లరాదని, క్వారీ పరిసరాల్లో ఎవరు పట్టుబడినా కేసులు తప్పవన్నారు.