సిగినాపల్లి రంగురాళ్ల క్వారీలో 24 గంటలు గస్తీ
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:16 PM
పెదవలస రేంజ్ పరిధిలోని సిగినాపల్లి క్వారీలో తవ్వకాలు జరగకుండా అటవీ శాఖ ఉద్యోగులు 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నారని స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) వైవీ నరసింహరావు అన్నారు.
క్వారీలో తవ్విన గొయ్యి పూడ్చివేత
నలుగురు వ్యాపారులపై బైండోవర్ కేసులు
డీఎఫ్‌వో వైవీ నరసింహరావు
చింతపల్లి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పెదవలస రేంజ్ పరిధిలోని సిగినాపల్లి క్వారీలో తవ్వకాలు జరగకుండా అటవీ శాఖ ఉద్యోగులు 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నారని స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) వైవీ నరసింహరావు అన్నారు. శుక్రవారం సిగినాపల్లి కొండపై తవ్విన గొయ్యిని కాంక్రిట్‌తో అటవీ శాఖ ఉద్యోగులు పూడ్చివేశారు. ఈసందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం సిగినాపల్లి క్వారీలో తవ్వకాలు నిర్వహించేందుకు వ్యాపారులు కూలీలతో ప్రయత్నించారన్నారు. దీంతో అటవీ శాఖ ఉద్యోగులను అప్రమత్తం చేశామన్నారు. ప్రస్తుతం ఫారెస్టు సెక్షన్ అధికారి, బీట్ అధికారి పర్యవేక్షణలో డివిజన్ పరిధిలోనున్న 20 మంది టాస్క్‌ఫోర్సు, బేస్ క్యాంప్ సిబ్బంది పగలు, రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి రోజూ 20మంది చొప్పున నిరంతరంగా కొండపై గస్తీ నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. క్వారీ పరిసరాల్లో అనుమానంగా ఎవరు సంచరించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశామన్నారు. క్వారీల్లో తవ్వకాలకు వెళ్లరాదని క్వారీ పరిసర గ్రామాల గిరిజనులకు అవగాహన కల్పించామన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా గతంలో రంగురాళ్ల వ్యాపారం చేసిన నలుగురిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. వ్యాపారులు క్వారీలో తవ్వకాలు నిర్వహించేందుకు కూలీలను ప్రోత్సహించే అవకాశం ఉందనే సమాచారంతో వారిని బైండోవర్ చేశామన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అటవీశాఖ కార్యాలయానికి వచ్చి సంతకాలు చేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. నర్సీపట్నంకి చెందిన వ్యాపారులపై నిఘా పెట్టామన్నారు. ఇప్పటికే కొంతమంది వ్యాపారుల వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌వో పి. నూకరాజు, ఎఫ్‌బీవో బి. గోపి పాల్గొన్నారు.