Share News

పాడేరులో 24 గంటలు అంధకారం

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:40 AM

జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఎక్కడికక్కడ విద్యుత్‌ స్తంభాలు కూలిపోయి సుమారుగా 24 గంటల పాటు అంధకారం అలుము కుంది.

పాడేరులో 24 గంటలు అంధకారం
పాడేరులో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు చేపడుతున్న సిబ్బంది

- గాలి, వాన ప్రభావంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

- రేయింబవళ్లు శ్రమించిన విద్యుత్‌ యంత్రాంగం

- ఎట్టకేలకు సరఫరా పునరుద్ధరణ

పాడేరు, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఎక్కడికక్కడ విద్యుత్‌ స్తంభాలు కూలిపోయి సుమారుగా 24 గంటల పాటు అంధకారం అలుము కుంది. అయితే శుక్రవారం రాత్రి నుంచే విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి రేయింబవళ్లు శ్రమించడంతో శనివారం రాత్రికి పూర్తి స్థాయిలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరిగింది. ముఖ్యంగా మండలంలోని గుత్తులపుట్టు, కిండంగిలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల నుంచి ఇక్కడికి వచ్చే 33 కేవీ లైన్‌ విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడం, తీగలు తెగిపోవడంతో తీవ్ర సమస్య ఏర్పడింది. దీంతో శనివారం పాడేరులోని అనేక మంది ఇళ్లలో నీళ్లు సైతం లేని పరిస్థితి నెలకొంది. నేలకొరిగిన ఆయా స్తంభాల పునరుద్ధరణ, తెగిన తీగలను సరి చేయడం వంటి పనుల్లో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది నిమగ్నమై దశల వారీగా జిల్లా కేంద్రం పాడేరులోని ఒక్కో ప్రాంతానికి విద్యుత్‌ సర ఫరాను పునరుద్ధరించారు.

Updated Date - Apr 20 , 2025 | 12:41 AM