245 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:54 PM
మండలంలోని కుజబంగి జంక్షన్ సమీపంలో గురువారం 245 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశామని ఎస్‌ఐ జె.రామకృష్ణ తెలిపారు.
ఒకరి అరెస్టు
ముగ్గురు పరారీ
ముంచంగిపుట్టు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కుజబంగి జంక్షన్ సమీపంలో గురువారం 245 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశామని ఎస్‌ఐ జె.రామకృష్ణ తెలిపారు. మరో ముగ్గురు పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గంజాయి రవాణా జరుగుతోందని పక్కా సమాచారం రావడంతో పోలీసులు గురువారం కుజభంగి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఒడిశా వైపు నుంచి ఆటోలో వస్తున్న నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వారిని వెంబడించి ఒకరిని పట్టుకొన్నారు. మిగిలిన ముగ్గురు తప్పించుకుపోయారు. ఆటోని తనిఖీ చేయగా అందులో గంజాయి బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. పట్టుబడిన గంజాయి సుమారు 245 కిలోలు ఉంది. నిందితుడిని అరెస్టు చేసి ఆటో, సెల్‌ఫోన్, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ముంచంగిపుట్టు మండలం కరిముఖిపుట్టు పంచాయతీ మెరకచింత గ్రామానికి చెందిన గొల్లోరి మహీంద్రగా గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు ఒడిశాలోని కోరాపుట్టు జిల్లా అబరాడ గ్రామానికి చెందిన కిరసాయి భూషణ్, మద్దిపుట్టు గ్రామానికి చెందిన కిముడు నీల, ముసిరిగూడ గ్రామానికి చెందిన సుకిరి దాములుగా గుర్తించామని, వారిని త్వరలో పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని ఆంధ్రా మీదుగా ఒడిశా పాడువ తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుబడినట్టు ఆయన చెప్పారు.