Share News

24 మంది విద్యార్థినులకు అస్వస్థత

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:31 PM

మండలంలోని రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 24 మంది విద్యార్థినులు నిల్వ ఉన్న బర్త్‌ డే కేకు తిని అస్వస్థతకు గురయ్యారు.

24 మంది విద్యార్థినులకు అస్వస్థత
చికిత్స పొందుతున్న విద్యార్థినులు

నిల్వ ఉన్న బర్త్‌డే కేకు తిని వాంతులు, విరేచనాలు

సకాలంలో పీహెచ్‌సీకి తరలించిన ఆశ్రమ పాఠశాల సిబ్బంది

ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేజీహెచ్‌కి తరలింపు

కొయ్యూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 24 మంది విద్యార్థినులు నిల్వ ఉన్న బర్త్‌ డే కేకు తిని అస్వస్థతకు గురయ్యారు. వీరికి శనివారం రాత్రి వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే స్థానిక రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆదివారం ఉదయం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న టి.కీర్తి ప్రసన్న అనే విద్యార్థిని 14వ తేదీన రాత్రి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కేకు కట్‌ చేసి సహచర విద్యార్థినులకు పంచింది. మిగిలిన కేకును దాచి ఉంచి శనివారం మధ్యాహ్నం మరికొంత మంది తిన్నారు. కేకు తిన్న జన్ని అక్షయ, కె.పద్మ, కె.లలిత, వి.పూజ, ఎం.అశ్వని, జె.హాసిని, కె. దివ్య, జె.హారిక, మాహి ప్రియ, కె.రాజేశ్వరి, టి.కీర్తిప్రియ, వి.లలిత, ఎం.బంగారమ్మ, డి. హేమ మాధురి, వి.అమ్ములు, వి.పూజ, కె.శైలు, ఎ.నవ్యశ్రీ, ఎం.శ్రావణి, వి.సునీత, జె.నాగమణి, టి.మరియా, కె.కృష్ణవేణి, ఎం.మానస అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి వీరికి వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే వారిని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ఉన్నతాధికారులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్‌ పీహెచ్‌సీకి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయానికి టి.కీర్తి ప్రసన్న, జె.హాసినిల ఆరోగ్య పరిస్థితి కొంతమేర విషమంగా ఉండడంతో అంబులెన్సులో విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో నలుగురిని డిశ్చార్జి చేయగా, మిగిలిన వారికి పీహెచ్‌సీలో వైద్య సేవలందిస్తున్నారు. కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ వీడియో కాల్‌లో బాధిత విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. డిప్యూటీ డైరక్టరు వీడియో ద్వారా విద్యార్థినిల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకున్నారు. వైద్యాధికారులు స్నేహలత, నాయక్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేశారు. వీరి ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు నిర్ధారించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కాకూరు చంద్రరావు, మాజీ ఎంపీపీ జి.సత్యనారాయణ, సర్పంచ్‌ పీటా సింహాచలం పీహెచ్‌సీకి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కిశోర్‌వర్మ ఈ సంఘటనపై ఆరా తీశారు. ఆశ్రమ పాఠశాలకు వెళ్లి సిబ్బందిని విచారించారు.

Updated Date - Nov 16 , 2025 | 11:31 PM